గత కొన్నేళ్ళుగా గుంటూరు వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొన్నేళ్లుగా జనాభాతోపాటు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరగడంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి… ప్రజలు కూడా ట్రాఫిక్ ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు… ఆరేళ్ల తర్వాత ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారులు రోడ్ల విస్తరణ పనులు ముమ్మరం చేశారు. రాజధాని ప్రాంతంలో కీలకప్రాంతమైన గుంటూరుకు కొన్నేళ్లుగా వలసలు భారీగా వచ్చాయి. దీంతో నగర జనాభా పదిలక్షలకు చేరింది. జనాభాకు తగ్గట్లుగానే వాహనాల సంఖ్య కూడా పెరగడంతో ఆఫీస్ సమయాల్లో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తరచూ ఎదురవుతున్నాయి. గతంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరంలో రోడ్ల విస్తరణ చేపట్టాలని ప్రపోజల్స్ తయారు చెయ్యడమే తప్ప ఆచరణలో అడుగు ముందుకు పడలేదు.
Read Also: Guntur Roads Extension: రోడ్ల విస్తరణకు మోక్షం ఎప్పుడు?
2016లో కృష్ణా పుష్కరాల సమయంలో అమరావతి వెళ్లే రోడ్డు మాత్రమే ట్రాఫిక్ కు అనుగుణంగా విస్తరణ పనులు చేపట్టారు. తర్వాత రోడ్ల విస్తరణ గురించి ఎవరూ పట్టించుకోలేదు. గుంటూరు కార్పోరేషన్ కు కొత్త పాలకవర్గం రావడంతో రోడ్ల విస్తరణ పనులకు మోక్షం కలిగింది. రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం నగరంలో కీలక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులు మొదలుపెట్టారు. గుంటూరునుంచి పల్నాడు ప్రాంతానికి వెళ్లే రహదారి అయిన పలకలూరు రోడ్డు విస్తరణ చెయ్యాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. నిత్యం వేలాది వాహనాలు ఈ రూట్ లోనే గుంటూరు నగరంలోకి వస్తుటాయి. ప్రస్తుతం 80 అడుగులుగా ఉన్న ఈ రోడ్డును మాస్టర్ ప్లాన్ ప్రకారం 120 అడుగులకు విస్తరించే పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇల్లు కూల్చివేసే కార్యక్రమం చురుకుగా కొనసాగుతున్నాయి.
గుంటూరులో మరో కీలకప్రాంతం కొత్తపేట రోడ్డు. ఈ రోడ్డులో వందలాది ఆసుపత్రులున్నాయి. నాలుగైదు జిల్లాలనుంచి రోజు వేలాదిమంది ఆసుపత్రులకు వస్తుంటారు. ఇన్నర్ రింగ్ రోడ్డునుంచి కుగ్లర్ ఆసుపత్రి రోడ్డు వరకూ విస్తరణ పనులను అధికారులు మొదలుపెట్టారు. ఈ ప్రాంతం మొత్తం కమర్షియల్ కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 30అడుగుల రోడ్డును 40 అడుగుల రోడ్డుగా మార్చనున్నారు. ఏటీ అగ్రహారం రోడ్డు కూడా 50 అడుగునుంచి 80 అడుగులకు విస్తరిస్తున్నారు. దీంతో నగరంలోనుంచి చుట్టగుంట వరకూ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.
గుంటూరునుంచి జాతీయ రహదారికి కనెక్టివిటీ రోడ్లపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. రామనామక్షేత్రం రోడ్డు కూడా 60 అడుగునుంచి 80 అడుగులకు విస్తరిస్తున్నారు. శుద్దపల్లిడొండ రోడ్డు, పందుల రోడ్డు విస్తరణ ద్వారా వాహనాలు ఈజీగా నేషనల్ హైవేకి చేరుకునేలా నిర్మాణం చేపట్టనున్నారు. రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి ఇప్పటికే టీడీఆర్ బాండ్లు కార్పోరేషన్ అధికారులు ఇచ్చారు. పూర్తిస్థాయిలో రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయినట్లే అంటున్నారు.
