Site icon NTV Telugu

Janasena Party: జనసేన పీఏసీ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం

Janasena Party

Janasena Party

Janasena Party: అమరావతిలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఏసీ సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల పవన్ విశాఖ పర్యటనపై తీర్మానాన్ని జనసేన పార్టీ ప్రవేశపెట్టింది. పవన్ విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ వైసీపీ వ్యవస్థలను దుర్వినియోగం చేసి భయానక పరిస్థితులను సృష్టించిందని తీర్మానంలో ఆరోపించింది. ఈ చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలియజేశారని వెల్లడించింది.

అటు కేంద్రమంత్రి మురళీధరన్, టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, లోక్ సత్తా పార్టీ నేతలు జయప్రకాష్ నారాయణ, బాబ్జీ ఈ చర్యలను ఖండించి పవన్ కళ్యాణ్‌కు సంఘీభావం తెలిపారని వివరించింది. తెలంగాణకు చెందిన పలువురు నేతలు, పౌర సమాజం నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు, మేధావులు ఈ చర్యలను తప్పుబట్టి సంఘీభావం తెలిపారని జనసేన పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తొలి తీర్మానం చేసినట్టు వెల్లడించింది. విశాఖలో 180 మందిపై వివిధ సెక్షన్లతో అక్రమ కేసులు నమోదు చేశారని, వారిలో 28 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారని జనసేన తన ప్రకటనలో తెలిపింది. అరెస్ట్ చేసిన నేతలను అర్ధరాత్రి బలవంతంగా గుర్తుతెలియని ప్రాంతాలకు తరలించారని ఆరోపించింది.

Read Also: Pawan Kalyan Pressmeet Live: జనసేనానిపై కుట్ర?

కేసుల కారణంగా పోలీస్ స్టేషన్ల పాలైన నేతలు, వీర మహిళలు, జనసైనికులు, వారి కుటుంబ సభ్యుల్లో మనో ధైర్యం నింపిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు రెండో తీర్మానం చేసినట్టు జనసేన వివరించింది. విశాఖ అక్రమ కేసుల్లో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నేత మన కుటుంబ సభ్యుడే అన్న భావనతో, వారిని కాపాడుకునే బాధ్యతను స్వీకరిస్తూ ఈ నెల 18వ తేదీన జరిగిన సమావేశంలో తీర్మానం చేశారని, ఆ తీర్మానాన్ని నేటి సమావేశంలో బలపర్చినట్టు జనసేన వెల్లడించింది. అక్రమ కేసుల్లో ఉన్నవారికి న్యాయపరమైన సహాయం అందించిన పార్టీ న్యాయ విభాగం సభ్యులను, న్యాయవాదులను అభినందిస్తూ తీర్మానం చేసినట్టు జనసేన పార్టీ పేర్కొంది.

Exit mobile version