Site icon NTV Telugu

Rescue Teams Headache: ఉదయం వచ్చి రాత్రికి నాటుపడవల్లో…

Rescue Teams

Rescue Teams

ఏపీలో వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రెస్క్యూ బృందాలకు మాత్రం తలనొప్పులు తప్పడం లేదు. ఏలూరు జిల్లాలో భారీవర్షాలు, వరదలతో ఇళ్ళు, పొలాలు ఏకం అయిపోయాయి. గోదావరిలా మారిన రహదారులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మూడు వంతులు నీట మునిగిన కరెంట్ స్తంభాలతో కరెంట్ సరఫరా నిలిపేశారు. వందలాది మందిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఫైర్ సేఫ్టీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ముందస్తుగా ఇళ్లు వదిలి రావటానికి మొరాయిస్తున్న పలువురు గ్రామస్తులను బుజ్జగిస్తున్నాయి రెస్య్యూ టీంలు. ఒప్పించి ఉదయం తీసుకుని వస్తే సాయంత్రం నాటు పడవల్లో తిరిగి ఇళ్ళకు వెళ్ళి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. వీరిని ఎలాగైనా పునరావాస కేంద్రాలకు రప్పించడం తలకు మించిన భారంగా మారుతోంది.

మరోవైపు కుక్కునూరుకు అదనపు బలగాలు వస్తున్నాయి. భద్రాచలం దగ్గర ఇన్ ఫ్లో తగ్గినా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద తగ్గటానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం వుందంటున్నారు అధికారులు. దీంతో రంగంలోకి వచ్చిన అదనపు రెస్క్యూ బృందాలు అటువైపు వెళుతున్నాయి. కుక్కునూరుకు 40 మంది అదనపు రెస్క్యూ టీం చేరుకుంది. అక్కడ పరిస్థితిని వారు సమీక్షిస్తున్నారు. వర్షాలు తగ్గినా వరద ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్నారు అధికారులు.

Aam Aadmi Party: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించిన ఆమ్‌ఆద్మీ పార్టీ

కోనసీమ లంక గ్రామాల్లో వర్ణనాతీతంగా మారింది వృద్దుల (Elders Problems) పరిస్థితి. ఆరోగ్య సమస్యలతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న ముసలి వాళ్లు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరూ లేని వారి పరిస్థితులు మరింత కష్టంగా మారాయి. ఆదుకునే వారి కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఎవరు అయినా దయతలచి పెడితే తినడం, లేదంటే పస్తులు తప్పడంలేదంటున్నారు. ఎప్పుడో తమ చిన్నతనంలో ఈస్థాయి వరద చూసామని చెబుతున్నారు ముసలిముతక. ఇంత భారీ స్థాయిలో గోదావరికి వరద రావడం అరుదని వారంటున్నారు. ఇదిలా వుంటే.. ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అక్కడ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 24.57 లక్షల క్యూసెక్కులుగా వుంది.

విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు. 28 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం వుందని చెబుతున్నారు. సంబంధిత అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది విపత్తుల సంస్థ. అంబేద్కర్ కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం వుందని తెలుస్తోంది. అల్లూరిసీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి లో 4 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం వుంది. ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం వుందని చెబుతున్నారు.

అధికారులకు ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు అందుతున్నాయి. వరద ఎక్కువ అయ్యే అవకాశం వుండడంతో అదనపు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వున్నాయి. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 279 గ్రామాలు వరద ప్రభావితం అయింది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Kajol Devgan: కాజోల్ బోల్డ్ కామెంట్స్.. ఫిగర్ లేనివాళ్లు కూడా హీరోయిన్లు అవుతున్నారు

Exit mobile version