ఏపీలో ఒక వైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్న క్రమంలో కరోనా వైద్యంలో కీలకమైన రెమిడెసివర్ ఇంజెక్షన్ మాత్రం దొరకడం లేదు. కరోనా వచ్చిన రోగులకు చేసే వైద్యంలో రెమిడెసివర్ మాత్రమే ఏకైక ఇంజెక్షన్ కావడంతో దానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ ఇంజెక్షన్ కు డిమాండ్ కూడా తీవ్రంగా ఉంది. అయితే డిమాండ్ కు సరిపడా సరఫరా జరగని పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్ లో సైతం రెమిడెసివర్ ను విక్రయిస్తున్నారు. వీటిని అడ్డుకోవడంతో పాటు సరఫరా పెంచాల్సిన అవసరం ప్రస్తుతం తలెత్తింది.
రెమిడెసివర్ కరోనా వైద్యం లో వాడే ఇంజెక్షన్. రిటైల్ మార్కెట్ లో 2600 ఉన్న ఈ ఇంజెక్షన్ ఆసుపత్రిలో 3500 కి లభిస్తోంది. ఒక్కో కరోనా రోగికి ఆరు ఇంజెక్షన్లు కోర్సుగా వాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిన రోగులు అందరికి ఆసుపత్రిలో చికిత్స కోసం దీన్ని తప్పనిసరిగా వాడుతున్నారు. ఉగాది పండుగకు ముందు అంటే మార్చి నెలాఖరు నాటికి కరోనా కేసుల పెరుగుదల అంతగా లేదు. గత వారం 10 రోజులుగా మాత్రమే ఏపీలో కేసుల వ్యాప్తి చాలా వేగంగా విస్తరిస్తున్నపరిస్థితి. దీంతో మళ్లీ రెమిడెసివర్ కు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. దీంతో కొరత కూడా మొదలై బ్లాక్ లో అమ్మే స్థాయికి వెళ్లింది. ఏపీలో అన్ని ఆసుపత్రులకు అత్యధికంగా బెజవాడ గాంధీ నగర్ లో ఉన్న హెటిరో డీలర్ నుంచి ఇది సరఫరా అవుతోంది.
రెమిడెసివర్ ను బహిరంగ మార్కెట్ లో విక్రయించ వద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో కరోనా చికిత్సకు అనుమతించిన ఏపీలో 200కుపైగా ఆసుపత్రుల్లో మాత్రమే ఇది లభిస్తోంది. ఆయా ఆసుపత్రిలో ఉన్న పేషేంట్స్, కేసుల తీవ్రత, ప్రభుత్వ ఆదేశాల బట్టి ఆసుపత్రులకు దీన్ని సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అత్యధికంగా హెటిరో డీలర్ నుంచే మేజర్ షేర్ సరఫరా అవుతోంది. మార్కెట్ లో ఇంకా మరో 5 కంపెనీల నుంచి ఈ ఇంజెక్షన్ వచ్చినా సరఫరా అనుకున్న మేర అందుబాటులోకి రాలేదు. రోజుకు 50 వేల ఇంజెక్షన్ల డిమాండ్ ఉంటే 5 వేల ఇంజెక్షన్లు మాత్రమే సరఫరా అవుతున్న పరిస్థితి. దీంతో విపరీతంగా కొరత వచ్చేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధార్ కార్డు ఉన్నవారికి డీలర్లు వారం క్రితం వరకు అమ్మకాలు జరిపారు. అయితే వీటిని బ్లాక్ లో ఒక్కో ఇంజక్షన్ ని 10 నుంచి 20 వేలకు అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని గుర్తించిన డ్రగ్స్ అధికారులు డీలర్ల దగ్గర అమ్మకాలు కూడా నిలిపివేశారు. దీంతో డీలర్ దగ్గరకు వచ్చిన వారు ఇప్పుడు వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితి.