Site icon NTV Telugu

Relief For TTD EO DharmaReddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఊరట.. రిట్ పిటిషన్ డిస్మిస్

Eo Dharma Reddy

Eo Dharma Reddy

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఊరట లభించింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ కొట్టివేసింది ఏపీ హైకోర్టు. టీటీడీ ఈఓగా ధర్మారెడ్డి నియామకం చెల్లదని రిట్ పిటిషన్ దాఖలు చేశారు నవీన్ కుమార్ రెడ్డి. అయితే, పిటిషన్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీచేశారు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్. టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా నియమించాలంటే దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 107లో పొందుపరిచిన అర్హతల ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అదే స్థాయిలో ఏ పదవిచేసి ఉన్న సరిపోతుందని హైకోర్టు పేర్కొంది.

ఏవి ధర్మారెడ్డి అర్హతల్లో జిల్లా కలెక్టర్ సమానమైన పదవిని రాష్ట్ర ప్రభుత్వంలో చేయడాన్ని పరిగణనలోకి తీసుకుంది న్యాయస్థానం. దీంతో న్యాయస్థానం రిట్ పిటిషన్ కొట్టేసింది. దీంతో ఆయనకు రిలీఫ్ లభించినట్టయింది. ధర్మారెడ్డి 1991లో ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్ సర్వీస్ గ్రూప్-ఏ సర్వీసెస్ పోస్టులో యూపీపీఎస్సీ ద్వారా నియమితులయ్యారు. ఆయన్ను డిప్యుటేషన్‌పై ఆంధ్రకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ (DOPT) 2019 జూలై 8న ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మే 14తో ఆ డిప్యుటేషన్‌ కాలపరిమితి ముగిసిందని పిటిషన్‌లో నవీన్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు.

Read Also: TTD: ఆ భక్తుడికి రూ.50 లక్షలు ఇవ్వండి.. టీటీడీకి కోర్టు ఆదేశాలు..

టీటీడీలో ఈవోగా పనిచేసిన జవహర్ రెడ్డి బదిలీ అనంతరం ధర్మారెడ్డికి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. టీటీడీ ఈవో పోస్టు ఖాళీ కావడంతో ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం మే 8న జీవో 813 జారీ చేయగా.. ఈ నియామకం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఐడీఈఎస్‌ అధికారి అయిన ధర్మారెడ్డికి జిల్లా కలెక్టర్‌ స్థాయి అర్హత లేదని గుర్తు చేశారు. అందుకే ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోర్టును కోరారు. జిల్లా కలెక్టరు, ఆ హోదాకు సమాన అర్హతలున్న వ్యక్తిని ఈవోగా నియమించేలా చూడాలన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈవోగా ధర్మారెడ్డిని నియమించేందుకు అర్హతలు ఉన్నాయని పేర్కొంది. దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 107లో పొందుపరిచిన అర్హతల ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అదే స్థాయిలో ఏ పదవిచేసినా సరిపోతుందని, ఈ పిటిషన్ కొట్టివేస్తున్నామని కోర్టు తెలిపింది.

Read Also: Electric Bus For Tirumala: తిరుమలకు గేరు లేని బండి..హంగులెన్నో తెలుసాండీ?

Exit mobile version