టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి కూల్చివేత పై హైకోర్టు స్టే విధించింది. అయ్యన్న ఇంటి కూల్చివేత పై ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. అర్థరాత్రి వాదనలు ముగిశాయి.జలవనరుల శాఖ గతంలో అనుమతి ఇచ్చినప్పటికీ ఎటువంటి నోటీసు లేకుండా ఇల్లు కూల్చివేస్తున్నారని వాదనలు వినిపించారు.
దీంతో వాదనలు విన్న అనంతరం హైకోర్ట్ అయ్యన్న ఇంటి దగ్గర కూల్చివేతపై స్టే విధించింది హైకోర్ట్. వెంటనే ఈ సమాచారాన్ని స్థానిక అధికారులకు తెలియజేయాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఇంటి జోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇల్లు కూల్చివేతపై హౌస్ దాఖలు చేసిన మోషన్ పిటిషన్ పై అయ్యన్నపాత్రుడు తరుపున వాదనలు వినిపించారు న్యాయవాది సతీష్. దీంతో నర్సీపట్నంలో నెలకొన్న హై డ్రామాకు తెరపడింది. గోడ కూల్చివేతకు వచ్చిన జేసీబీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు బీసీలపై దాడులను, హత్యలను నిరసిస్తూ సోమవారం ఛలో నర్సీపట్నం కార్యక్రమం చేపడతామని ప్రకటించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అనేక మంది బలహీన వర్గాల నాయకులపై ఈ ప్రభుత్వం దాడులు చేసింది. ఇప్పటివరకు 26 మంది బీసీ నేతలను హత్య చేశారు వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రశ్నించిన బీసీ నాయకులే టార్గెట్ గా వారిపై దాడులు చేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమను నిలదీయటానికి అందరూ నర్సీపట్నంకి తరలి రావాలని ఆయన కోరారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?