దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ముందు వర్షాలతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారింది. విశాఖలో చల్లని, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ప్రధాన వీధులన్నీ జలమయం అయ్యాయి. శ్రీశైలంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో భక్తులు ఉపశమనం పొందుతున్నారు. అకాలవర్షంతో పంటలకు నష్గం వాటిల్లిందని అన్నదాతలు వాపోతున్నారు.
మాచర్ల, గురజాలలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఏపీలో తూర్పు గోదావరి, కాకినాడ, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటితోపాటు పల్నాడు జిల్లాకు పిడుగు హెచ్చరికలు జారీ అయ్యాయి. మాచర్ల, రెంటచింతల, గురజాల, దాచేపల్లి, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, పిడుగురాళ్ల, బొల్లపల్లి మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని డా.బిఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ డైరెక్టర్ తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.
సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని డా.బిఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ డైరెక్టర్ సూచించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో జనం అప్రమత్తం అయ్యారు. పిడుగులు పడే సమయంలో జిల్లాల వాసులు సురక్షిత భవనాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కానీ, మాచర్ల మండలం కంభంపాడులో అరకకు వెళ్లి పిడుగుపాటుతో బాలుడు అమరయ్యతో పాటు రెండు ఎద్దులు మృతి చెందాయి.
Live : హైదరాబాద్ లో గాలివాన బీభత్సం