అసలే ఎండలు మండిపోయి, రోళ్ళు కూడా బద్ధలు అయ్యే సమయం.. కానీ అకాలవర్షాలు, పిడుగులు పడుతూ వానాకాలాన్ని తలపిస్తోంది వాతావరణం. ఏపీలో వాతావరణ పరిస్థితులు, పిడుగులు పడే అవకాశం గురించి ఏపీ విపత్తుల నిర్వహణ తాజా ప్రకటన విడుదల చేసింది. దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల నాటికి గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలో 79మి.మీ అధికవర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
రానున్న మూడు రోజుల వాతావరణ వివరాలు ఏంటంటే?
బుధవారం:- శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగుల కూడి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
గురువారం:- పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
శుక్రవారం :- పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, అన్నమయ్య , శ్రీ సత్య సాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: Chikoti Praveen: పోకర్ ఇల్లీగలని తెలీదు.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నా
