NTV Telugu Site icon

Rahul Gandhi: ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు.. స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన రాహుల్‌

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ముగిసింది.. తుంగభద్ర బ్రిడ్జిపై కర్ణాటకలోకి అడుగుపెట్టారు రాహుల్‌ గాంధీ… అయితే, ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశారు.. భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన లభించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్న ఆయన.. ఇక్కడి వ్యక్తులతో నేను అనుభవించిన ప్రేమ బంధం లోతైనది మరియు దృఢమైనది అని రాసుకొచ్చారు.. అంతే కాదు.. ఈ ప్రేమకు కాంగ్రెస్ కృషితో ప్రతిఫలం దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం అని మరోసారి హామీ ఇచ్చారు రాహుల్‌ గాంధీ..

Read Also: CM YS Jagan: పోలీసులపై పని ఒత్తిడి తగ్గిస్తాం.. వీక్లీ ఆఫ్ ఉండేలా చర్యలు..

కాగా, ఏపీలో తన పాదయాత్రలో రాహుల్‌ గాంధీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామని.. ఆ విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని డిమాండ్‌ చేసిన ఆయన.. మూడు రాజధానుల ఆలోచన సరికాదన్నారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు, అమరావతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు రాహుల్‌.. కాగా, ఏపీలో 120 కిలోమీటర్ల మేర సాగింది రాహుల్‌ పాదయాత్ర.. ఏపీ కాంగ్రెస్‌ నేతలు, ప్రజలు ఆయనకు వీడ్కోలు పలికారు.. తుంగభద్ర బ్రిడ్జిపై ఆయనకు స్వాగతం పలికారు కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు.. రెండు రోజుల పాటు రాయచూర్‌ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుండగా.. ఎల్లుండి ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనుంది భారత్‌ జోడో యాత్ర.. ఇక, ఏపీలో ఇవాళ తన భారత్‌ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో.. ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు రాహుల్‌ గాంధీ.