CM Jagan: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆమె విజయవాడ చేరుకోగా గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడ పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌరసన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం గొప్ప విషయం అన్నారు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ముర్ము జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు. తమ గ్రామంలో డిగ్రీ వరకు చదువుకున్న తొలి మహిళగా ముర్ము నిలిచారని.. జూనియర్ అసిస్టెంట్‌గా ఆమె జీవితం ప్రారంభించారని గుర్తుచేశారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. భారత్ అభివృద్దిలో ఏపీది కీలక పాత్ర అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఉండే ఈ నేలపై తాను అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి వంటి నదులు ఈ రాష్ట్ర నేలలను సారవంతం చేశాయని వెల్లడించారు. నాగార్జున సాగర్, నాగార్జున కొండ, అమరావతి భారత దేశ చారిత్రక వారసత్వ సంపద అని.. కూచిపూడి నృత్యం భారత సాంస్కృతిక వైశిష్ట్యమని పేర్కొన్నారు. దేశంలోని అన్ని భాషల్లో తెలుగు శ్రేష్టమైందని.. నన్నయ్య, మల్లన్న, తిక్కన నడయాడిన నేల ఇదని పేర్కొన్నారు. మొల్ల రాసిన మొల్ల రామాయణానికి చరిత్రలో విశిష్ట ప్రాధాన్యత ఉందని చెప్పారు. జైహింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగం ముగించారు. కాగా ముర్ము దేశ భాషలందు తెలుగు లెస్స అనగానే అతిథుల నుంచి పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు వినిపించాయి.