NTV Telugu Site icon

Pregnants Problems in Agency: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. నిండు గర్భిణికి నరకయాతన

Doli 2

Doli 2

ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల జీవితాల్లో మాత్రం వెలుగులు ప్రసరించడం లేదు. గిరిజనులు నడవడానికి కూడా రోడ్డు సౌకర్యం అందడం లేదు. దీంతో గిరిజనులు, ముఖ్యంగా గర్భిణీలు నానా కష్టాలు పడుతున్నారు. ఒక్కోసారి ప్రసవం కోసం కిలోమీటర్లు నడిచి కడుపులో బిడ్డను కోల్పోయి కడుపుకోతను అనుభవిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భిణీల డోలి మోతలు తప్పడం లేదు. తాజాగా అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ రాచకీలం కొండపై గ్రామంలో సూకూరు లక్ష్మి(20) అనే గర్భిణీకి ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే 108 కి ఫోన్ చేశారు.

Read Also: KS Eshwarappa: అల్లా ఏమైనా చెవిటివాడా.. ‘అజాన్’పై బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు

అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో గర్భిణీని రోడ్డు మార్గం తెమ్మన్నారు. దీంతో కొండపైనుంచి రాచకిలం నుంచి గుమ్మంతి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలు, ఎత్తైన కొండ మార్గం నుంచి మైదాన ప్రాంతం గుమ్మంతి వరకు ఆమెను డోలిపై మోసుకుని అంబులెన్సు వద్దకు వచ్చారు. అంబులెన్సులో ఆమెను పినకోట ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ వైద్యులు లేకపోవటం వల్ల ఆమెను కే.కోటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ వైద్యుల సూచన మేరకు ఆమెను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. గత ఏడాది సెప్టెంబర్ లో డోలిపై ఇద్దరు రోగులను తరలించడంతో వారు చికిత్స పొందుతూ మృతి చెందారు.

తమ గ్రామాలకు రోడ్డు లేకపోవటం వల్ల ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా.. డోలి మోతలే గత్యంతరం అని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తమ అనుమతులు లేనిదే శ్రమదానం చేసి రహదారి నిర్మిస్తే.. కేసులు పెడతామని బెదిరించినట్లు గ్రామస్థులు వాపోతున్నారు. అయితే అప్పటినుంచి శ్రమదానంతో రహదారి పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం నిర్మించదని, తాము రోడ్డు వేసుకుంటామంటే అటవీ అధికారులు అడ్డుతగలడం దారుణం అంటున్నారు గ్రామస్తులు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Gold Smuggling : బంగారం బీరు బాటిళ్లలో పెట్టావు బాగానే ఉంది.. కానీ