Balineni Srinivasa Reddy: అందరూ ఊహించినట్లుగానే జరిగింది.. వైసీపీకి ఆ పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు తన రాజీనామా లేఖ పంపారు. కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన రాజీనామా లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు.. ముఖ్యంగా పార్టీలో కోటరీ నడుస్తోందని.. ఇది తనను తీవ్రంగా బాధించిందన్నారు. తనపై అనేక వదంతులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి కాంగ్రెస్‌లో పిల్ల కాంగ్రెస్ విలీనం అవుతుందని తాను అనని మాటలను అన్నట్టుగా తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు. గతంలో పలు సందర్బాల్లో తాను జగన్ ను కలిసిన సమయంలో కూడా ఆయన ముందు ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదన్నారు. ప్రభుత్వంలో తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పానని.. వాటిని ఆయన నెగిటివ్‌గా తీసుకున్నారని అన్నారు.
Read Also: Viral Video: టిక్కెట్టు లేకుండా రైలులో జర్నీ.. అడిగినందుకు టీటీఈపై దాడి
ఇక, ఒంగోలు ఎంపీ టికెట్‌ను మాగుంటకు ఇవ్వాలని కోరానని.. కానీ పెద్ద నాయకులుగా చెప్పుకునే చెవిరెడ్డికి ఇచ్చారన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి… ఎక్కడో చిత్తూరు నుండి తిసుకువచ్చి ఒంగోలులో నిలబెట్టారని, ఇది తప్పుడు నిర్ణయమన్నారు. విజయవాడలో గురువారం రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణను కూడా అక్కడే ప్రకటిస్తానన్నారు. గతంలో తాను పార్టీలోని కొందరు వ్యక్తుల వల్ల పడుతున్న ఇబ్బందులు పలు సందర్బాల్లో ప్రస్తావించిన బాలినేని.. పార్టీలో తనకు జరిగిన అన్యాయాలను త్వరలో వివరిస్తానని తెలిపారు.. కాగా, ఊహించినదే అయినా.. గత కొంత కాలంగా ప్రచారంలో ఉన్నా.. ఓ సీనియర్ పొలిటీషియన్.. మాజీ మంత్రి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది.