ప్రకాశం జెడ్పీ సమావేశం వినూత్నంగా జరిగింది. జిల్లాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి సమావేశంలో పలు ప్రత్యేకతలు కనిపించాయి. ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు, బాపట్ల జిల్లాలకు వెళ్లటంతో ఆ జిల్లాల అధికారులు కూడా హాజరయ్యారు. జిల్లాల పునర్విభజన జరిగినా జెడ్పీ పాలకవర్గం విడిపోకపోవటంతో జెడ్పీ సమావేశానికి భార్యాభర్తలైన ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లతో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. మొదటి సారి ఇలాంటి సన్నివేశం జరగడంతో ఏ జిల్లాలోకి వెళ్లిన మండలాల సమస్యలను ఆ కలెక్టర్లకు సభ్యులు విన్నవించాల్సి వచ్చింది..
ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో జిల్లాల పునర్విభజన తర్వాత 38 మండలాలకు జిల్లా పరిమితమైంది. మిగిలిన 18 మండలాలు కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోకి వెళ్ళాయి. కొత్తగా జిల్లాలు ఏర్పడినప్పటికీ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం జిల్లా ప్రాదేశికాలు మాత్రం పాత పద్దతిలోనే కొనసాగనుండటంతో ఉమ్మడి జిల్లా ప్రకారమే జెడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఒంగోలు జెడ్పీ సమావేశం హాలులో చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సర్వ సభ్య సమావేశంలో అరుదైన సన్నివేశం జరిగింది. సమావేశానికి భార్యాభర్తలైన ప్రకాశం, బాపట్ల, కలెక్టర్లు దినేష్ కుమార్, కె.విజయలతో పాటు నెల్లూరు జిల్లా జేసీ హరేంద్ర ప్రసాద్ లు హాజరయ్యారు. వీరితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ విటపు బాల సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు మానుగుంట మహిధర్ రెడ్డి, కరణం బలరాం, అన్నా రాంబాబు, టీజేఆర్ సుధాకర్ బాబులు హాజరై పలు సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే జిల్లాల పునర్విభజన అనంతరం జరిగిన తొలి సమావేశం కావటంతో హాజరైన సభ్యులు తమ మండలాలకు సంబందించిన సమస్యలను తమ ప్రాంత కలెక్టర్ల దృష్టికి ప్రత్యేకంగా తీసుకు వెళ్లాల్సి వచ్చింది.
జెడ్పీ అధికారులు కూడా ప్రాదేశిక సభ్యులు తీసుకు వచ్చిన సమస్యలను విడివిడిగా ఆయ జిల్లాల అధికారులకు పంపాల్సి ఉండటం కూడా సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగేందుకు అవకాశం ఉంటుందని సభ్యులు భావిస్తున్నారు. సభలో ప్రధానంగా విద్యుత్ కోతలపై సంబంధిత అధికారులను సభ్యులు నిలదీశారు. వీటితో పాటు ప్రతిపక్ష పార్టీల సభ్యులెవరూ లేకపోవటంతో వైసీపీ సభ్యులే పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై పక్కపక్కనే ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు కూర్చుని ప్రజా సమస్యలు వింటూ ఉండటం ఆసక్తిని కలిగించింది. మరో విశేషం కూడా వుంది. ఈరోజు బాపట్ల కలెక్టర్ విజయ పుట్టినరోజు కావటంతో ఆ వేడుకలను ఇక్కడే నిర్వహించారు. కేక్ కట్ చేశారు.