Praja Sankalpa Yatra Completed 5 Years: వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు నేటితో ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగే వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ఆల్రెడీ ఈ వేడుకలకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇదో కీలక ఘట్టం కాబట్టి.. ఈ సందర్భాన్ని ఘనంగా నిర్వహించాలని వైసీపీ నేతలు నిర్ణయించారు.
కాగా.. 2017 నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి వైఎస్ జగన్ ఈ ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. 341 రోజుల పాటు కొనసాగిన ఈ పాదయాత్ర.. 2019 జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలను కలుపుతూ.. మొత్తం 3648 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. వైఎస్ జగన్‌కు అధికారం కట్టబెట్టడంలో ఈ పాదయాత్ర కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవడంలో సందేహం లేదు.
ఈ యాత్రలో భాగంగా వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పేదల్ని, రైతుల్ని కలుసుకొని.. వారి కష్టాలను అడిగి తెలుసుకొని.. వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుగ్గా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ప్రజలు ఆయన్ను బలంగా నమ్మి, సీఎం బాధ్యతల్ని అప్పగించారు. అంతకుముందు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్ర చేసే ముఖ్యమంత్రి అయ్యారు.