చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ.. నిన్న విశాఖపట్నంలోని నర్సీపట్నం టీడీపీ నేత అయ్యపాత్రుడు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నా కాస్తా పోలీసుల ఎంట్రీతో రసభాసగా సాగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, చింతలపూడి విజయ్ సహా 16 మందిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మేము అనుమతి తీసుకొనే ర్యాలీ చేపట్టామని అయ్యనపాత్రుడు అన్నారు. తన నివాసం నుంచి మొదలైన పాదయాత్ర మధ్యలోకి వచ్చినాక ఎందుకు ఆపారని ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఒత్తిడి, వైసీపీ నేతల కుట్రతోనే ఈ విధంగా పోలీసులు వ్యవహరిచారని ఆయన ఆరోపించారు.