అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు పడింది. సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోలీస్ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినందుకు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నవీన్ కుమార్ శెట్టిని అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిసాలి సస్పెండ్ చేశారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ లో అమ్మోనియా విషవాయువు ల ప్రభావంతో అస్వస్థతకు గురైన అంశానికి సంబంధించిన పోస్టు చివరిలో అన్న వచ్చాడు….అస్వస్థత తెచ్చాడు అంటూ క్యాప్షన్ పెట్టి పోలీస్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసినట్లు నవీన్ కుమార్ పై ప్రాధమిక ఆరోపణగా వున్నట్లు తెలుస్తోంది.
దీనిపై ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారితో విచారణకు అనకాపల్లి ఎస్పీ గౌతమిసాలి ఆదేశించారు. అయితే.. ఏపీ ప్రభుత్వంపై కానీ.. సీఎం జగన్‌పై కానీ కించపరిచే విధంగా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.