Site icon NTV Telugu

Nimmala Ramanaidu: పోలవరం నిర్వాసితులకు గుడ్‌న్యూస్..! రూ. 900 కోట్లతో పునరావాసం..

Nimmalka

Nimmalka

Nimmala Ramanaidu: 2026 మే నెల చివరి వరకు 28,946 మందికి రూ. 900 కోట్లతో పునరావాసం కల్పిస్తామని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2027 మార్చి వరకు పోలవరం నిర్వాసితులను పునరావాసం పూర్తి చేస్తామని తెలిపారు. పడకేసిన పోలవరం పనులను కార్యరూపం దాల్చేలా పనిచేస్తున్నామన్నారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ డిజైన్స్ అనుమతులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. పోలవరం పనులు జరుగుతున్న తీరు పట్ల కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కేంద్రం పోలవరం నిర్మాణానికి ఇచ్చే ప్రతి రూపాయిను సద్వినియోగం చేస్తున్నామని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి ప్రధాని చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం చేసేందుకు ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను ఆహ్వానించినట్లు చెప్పారు. బీహార్ ఎన్నికల తర్వాత ఆయన వస్తానని చెప్పారన్నారు.

READ MORE: Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు.

7.2లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందించే ప్రాజెక్టు పోలవరం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. “25.03 ఎకరాలకు స్థిరీకరణ అందించే ప్రాజెక్టు పోలవరం. 960 మెగావాట్ల విద్యుత్ అందించే ప్రాజెక్టు పోలవరం. గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు ను అనిశ్చితిలోకి నెట్టివేసింది. కూటమి ప్రభుత్వం లో పోలవరానికి అమితమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏపి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ వల్ల పనులు తిరిగి వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఏపి సీఎం నిర్దేశించిన 2027 లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. వర్షాకాలంలో కూడా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. చిత్తశుద్ధి తో పనులు పూర్తి చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం 2019లో కూడా కొనసాగినట్లయితే ఇప్పటికే పోలవరం పనులు పూర్తయ్యేయి. గత ప్రభుత్వ హయాంలో 17 నెలల పాటు పోలవరం పనులు జరగలేదు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడానికి గత ప్రభుత్వ తప్పిదాలే కారణం. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేశారు. కేంద్రం హెచ్చరికలను పట్టించుకోకుండా జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ పేరుతో అడ్డుకుంది. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే మా ప్రభుత్వం చేసిన పనులను ప్రజలు గుర్తించాలి. 900 కోట్ల వ్యయంతో డయాఫ్రం వాల్ నిర్మాణం కొత్తగా చేపట్టాల్సిరావడానికి కారణం జగన్ సర్కార్ నిర్వాకం! గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలి.” అని మంత్రి వ్యాఖ్యానించారు.

Exit mobile version