NTV Telugu Site icon

PMGKAY Scheme: ఏపీలో ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ

Ration Rice

Ration Rice

pmgkay scheme free rice will distributed from august 1st in andhra pradesh
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద బియ్యం పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ బియ్యం పంపిణీ చేయకపోతే ధాన్యం సేకరణ నిలిపివేస్తామన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హెచ్చరికల నేపథ్యంలో రేషన్ కార్డు దారులకు ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఉచిత బియ్యాన్ని జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) పరిధిలోని కార్డుదారులకే రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏపీలో మొత్తం 1.45 కోట్ల రేషన్ కార్డు దారులు ఉండగా వీరిలో 88.75 లక్షల మందికే ఎన్ఎఫ్ఎస్‌ఏ కార్డులు ఉన్నాయి. దీంతో మిగిలిన 56.6 లక్షల మంది రేషన్ కార్డు దారులకు బియ్యం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Read Also: BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు

కాగా పీఎంజీకేఏవై పథకం కింద ఏపీలో ఏప్రిల్ నుంచి బియ్యం పంపిణీ జరగడం లేదు. దీంతో ఆగస్టు నెలతో కలుపుకుంటే ఐదునెలల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబ సభ్యుడికి నెలకు 5 కిలోల చొప్పున 5 నెలలకు 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలి. ఒక కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే 100 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్రం భరించే రాయితీతో 5 నెలలకు సుమారు రూ.4వేలు విలువైన బియ్యం కార్డుదారులకు అందుతాయి. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో లేని రేషన్ కార్డు దారులు ఈ మేరకు నష్టపోవాల్సి ఉంటుంది. అయితే పౌరసరఫరాల శాఖ వద్ద పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం నిల్వలు లేవని.. అందుకే కూపన్లు ఇచ్చి వాటిపై విడతల వారీగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు వివరిస్తున్నారు. కాగా పీఎంజీకేఏవై ఉచిత బియ్యం పంపిణీపై మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సోమవారం పూర్తి వివరాలు చెప్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.