Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?

  • ఇంచార్జ్ పదవి పోయినా వర్మ చుట్టూ నేతల రద్దీ
  • 54 గ్రామాల నుంచి కాకినాడకు చేరిన కార్యకర్తలు
  • వర్మ తీరుపై జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి?
  • ‘నేను పిలవలేదు.. అభిమానులే వస్తున్నారు’ : వర్మ
Varma

Varma

పిఠాపురం నియోజకవర్గ రాజకీయం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్‌వీఎస్ఎన్ వర్మ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు నియోజకవర్గంలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పదవి నుంచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వర్మను తప్పించిన సంగతి తెలిసిందే. పార్టీ నిర్ణయంతో ఆయన అధికారికంగా నియోజకవర్గ బాధ్యతలకు దూరమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో రాజకీయాలు మాత్రం కాకినాడ కేంద్రంగా జోరుగా సాగుతున్నాయి.

పదవి పోయినప్పటి నుండి వర్మ అనుచరులు, స్థానిక టీడీపీ నేతలు భారీ సంఖ్యలో కాకినాడకు తరలివెళ్లి ఆయనను కలుస్తున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 54 గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు మండలాల వారీగా కాకినాడలోని వర్మ నివాసానికి చేరుకుని, తమ మద్దతు తెలియజేస్తూ ఆయనను ఓదారుస్తున్నారు. అక్కడ వారంతా కలిసి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చిస్తుండటం విశేషం.

అయితే, వర్మ కాకినాడలో ఉంటూ పిఠాపురం రాజకీయాల్లో ఈ విధంగా జోక్యం చేసుకోవడంపై మిత్రపక్షమైన జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గానికి దూరం చేసినా వర్మ కావాలనే తన అనుచరులతో హడావుడి సృష్టిస్తున్నారని జనసేన శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కూటమి ధర్మానికి విరుద్ధంగా సమాంతర రాజకీయాలు నడపడం సరికాదనే భావన జనసేనలో కనిపిస్తోంది.

ఈ వివాదంపై మాజీ ఎమ్మెల్యే వర్మ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. తానేమీ పిఠాపురం నుండి ఎవరినీ రమ్మని ప్రత్యేకంగా పిలవడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం తనపై ఉన్న పాత అభిమానంతోనే కార్యకర్తలు, ప్రజలు తనను కలవడానికి వస్తున్నారని పేర్కొన్నారు. తనను నమ్ముకుని ఇంటికి వచ్చిన వారిని వెనక్కి వెళ్ళిపొమ్మని తిరస్కరించలేనని, అభిమానులను కలుసుకోవడం తప్పు కాదని వర్మ సమర్థించుకుంటున్నారు. ఏదేమైనా పిఠాపురంలో వర్మ నడుపుతున్న ఈ ‘ఓదార్పు రాజకీయం’ కూటమి వర్గాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.