Perni Nani Fires on Chandrababu: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. రాజకీయాల కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఆయన రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి అబద్ధాలే మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. అశ్లీల చిత్రాలను సృష్టించడం, ప్రచారం చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోపై ఇదిగో సర్టిఫికేట్ తెచ్చాం…అమెరికా ఇచ్చింది అంటూ టీడీపీ నేతలు మాట్లాడారని.. అదేమన్నా అమెరికా FBI ఇచ్చిందా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ తప్పుడు కాగితాలు ఇచ్చింది ఎవరు అని నిలదీసిన ఆయన.. నిస్సిగ్గుగా దుర్మార్గంగా తప్పుడు రిపోర్టులను చూపుతారా అని మండిపడ్డారు. అసత్యాలతో ఒకపూట, ఒక రోజు ఏమార్చగలరేమో కానీ.. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. ఇంత దిగజారాల్సిన అవసరం ఏముందన్నారు.
దేవుడు చంద్రబాబుకు అసలు సిగ్గు పెట్టినట్లు లేదని.. ఈ రిపోర్ట్ కమ్మవాళ్ళు ఇచ్చారా అని టీడీపీ వాళ్లు అడిగారని…మరి పోతిన ప్రసాద్ ఎవరు అని పేర్ని నాని ప్రశ్నించారు. అతనికి ఈ రిపోర్టుతో ఏం సంబంధం ఉందని నిలదీశారు. చంద్రబాబే నేరుగా ల్యాబ్‌కు లేఖ రాయవచ్చుగా అని అభిప్రాయపడ్డారు. పోతిన ప్రసాద్ రిపోర్ట్ మార్చి ఇవ్వగలరా అని అడిగాడని.. వాళ్ళు దాన్ని కాదంటే వీళ్ళే ఎడిట్ చేసి బయటకు వదిలారన్నారు. చంద్రబాబు, లోకేష్, పట్టాభి, అనిత కుట్ర పూరితంగా తప్పుడు రిపోర్టుతో కుట్ర చేశారన్నారు. ఈ రిపోర్ట్ పోతిన ప్రసాద్ ట్యాంపర్ చేశాడని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారన్నారు. ఈ అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు టీడీపీ వాళ్లపై, వాళ్ల ఛానళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ తరపున వారిపై చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేస్తామన్నారు. మద్యంపై కూడా వాళ్ళు తెచ్చింది తప్పుడు రిపోర్టుగా రుజువైందని గుర్తుచేశారు.
Read Also: Botsa Satyanarayana: ఈ యాప్‌ను విద్యాశాఖలోనే కాదు.. అన్ని శాఖల్లోనూ తీసుకువస్తాం
అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ మోదీ దగ్గర వేషాలు వేస్తున్నాడని.. ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ కళ్యాణ్.. ఏనాడైనా పాచిపోయిన లడ్డూను మోదీకి పెట్టాడా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మోదీని తిట్టి.. ఇప్పుడు ఆయన సంకెక్కాడని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రానికి అసలు పవన్ కళ్యాణ్ ఏం చేశాడో చెప్పాలన్నారు. ప్రజలకు వినోదం, ఛానళ్లకు రేటింగ్ తప్ప ఆయన వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి మీదే అని.. అంతకుమించి పవన్ చేసేదేం ఉండదన్నారు. అసలు పవన్ కళ్యాణ్ దగ్గర రాజకీయం ఏముందని కాలక్షేపం తప్ప అని పేర్ని నాని కౌంటర్ వేశారు.
