Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను మోసం చేశాడు కాబట్టే.. చంద్రబాబుకు తిరుమల వెంకటేశ్వరస్వామి శాపం పెట్టాడని ఆరోపించారు. తన కొడుకు వయసులో ఉన్న జగన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడి మానసికంగా చంద్రబాబు క్షోభ పడేలా దేవుడు చేశాడని వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నాడని.. ఇప్పుడు పోలవరం వెళ్లి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇదంతా పాత కాలపు స్వామిజీల తంతులా ఉందని.. అసలు చంద్రబాబుకు మైండ్ ఉందా అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు ఇదేం ఖర్మ అనుకుంటున్నారని పేర్కొన్నారు.
మొన్నటి వరకు బాదుడే బాదుడు అన్నాడని.. హెరిటేజ్‌లో రేట్లు బాదుడే బాదుడు అని జనాలకు తెలియదా అని పేర్ని నాని చురకలు అంటించారు. చంద్రబాబును, లోకేష్‌లను చంపేందుకు కుట్ర జరుగుతోందట.. అసలు ఆయన్ను చంపాల్సిన అవసరం తమకేంటని నిలదీశారు. కాంతారావు సినిమా డైలాగులు ఇప్పుడూ వేస్తే ఎలా చంద్రబాబు? అని ఫైర్ అయ్యారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు, పవన్ కలిసి భోరు భోరున ఏడ్చారని.. ఇప్పుడేమో చంద్రబాబు తనకు అధికారం ఇస్తే ఈ పథకాలన్నీ కొనసాగిస్తాను అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు సంపద అంతా జగన్ దోచి పెడుతున్నాడని చెప్పారని.. ఇప్పుడు ఇవే పథకాలను తాను కూడా అమలు చేస్తానని చెప్పడం దేనికి సంకేతమన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల్లో నెట్టేస్తున్నాడని కూడా ఆరోపించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ కు చేసిన ద్రోహానికి వచ్చే ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు వస్తాయని పేర్ని నాని జోస్యం చెప్పారు.
Read Also: Bandi Sanjay: రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. మీకు అండగా మేమున్నాం
2004కు ముందు రైతులకు ఉచిత కరెంటు ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నాడని.. వైఎస్ఆర్ ఉచిత కరెంట్ ఇవ్వగానే తాను కూడా ఇస్తానని చెప్పుకున్నాడని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు అద్దం ముందు నిలబడి నాకు ఇదేం ఖర్మరా అనుకోవాల్సిందేనని.. 2014 నుంచి 2019 వరకు తాను చేసిన పరిపాలన మళ్ళీ తెస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పుకోలేక పోతున్నాడని ప్రశ్నించారు.చంద్రబాబు ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆరో రోజే మ్యానిఫెస్టో కనిపించకుండా మాయం చేశాడని.. టీడీపీ వెబ్‌సైట్‌లో మ్యానిఫెస్టో కనిపించకుండా చేశాడని పేర్ని నాని ఆరోపించారు.