గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటీన్‌లో మాంసాహారం వండిన ఘటన కలకలం రేపింది. ఇది సున్నితమైన అంశం కావడం, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆలయంలోని క్యాంటీన్ మూసివేసి, దాన్ని లీజుకు తీసుకున్న నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మాంసాహారం బయటే వండారని, దానికి సంబంధించిన రిక్షా ఆలయ ప్రాంగణంలోకి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై గురువారమే నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు.
అయితే అన్యమతస్తులు క్యాంటీన్ నిర్వహిస్తున్నారనే విషయం తమ దృష్టికి రాలేదని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. కాగా ఆలయ పవిత్రత దెబ్బతినే విధంగా కార్యకలాపాలు సాగుతుంటే ఆలయ అధికారులు ఏం చేస్తున్నారని హిందూ ధార్మిక సంఘాల నేతలు ప్రశ్నించారు. ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రసాదాలు తయారుచేసే క్యాంటీన్‌లోకి మాంసాహారం రావడంపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://ntvtelugu.com/controvercy-on-non-veg-cooking-in-pedakakani-temple-canteen/