వైసీపీ నేతలు ప్రత్యేక హోదా వచ్చేసినట్టు నిన్న సాయంత్రం వరకు గొప్పలు చెప్పారు.. సాయంత్రానికి కేంద్రం మాట మారిస్తే.. అది చంద్రబాబు వలనే అంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. అనంతపురంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అంటే మీరు అంత బలహీనంగా ఉన్నారా..? లేక చంద్రబాబు కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నారా? అని ప్రశ్నించారు.. ముందు హోదా అంశం లిస్ట్‌లో ఉందో లేదో తేల్చండి అని డిమాండ్ చేసిన పయ్యావుల.. వైసీపీ నేతలకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.. మీరు యుద్ధం చేయకుండానే.. యుద్ధం నుంచి తప్పుకుంటున్నారని ఆరోపించారు.
Read Also: Revanth Reddy: సీఎం డీఎన్‌ఏ ఏంటి? చైనాదా? అస్సామా?
కేంద్రం మీద యుద్ధం ప్రకటించండి.. ప్రజలతో పాటు టీడీపీ కూడా మీ వెంటే ఉంటుందని వైసీపీ నేతలకు సూచించారు పయ్యావుల కేశవ్… ఇటీవల సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ప్రత్యేక హోదా గురించి కనీస ప్రస్తావన లేదని విమర్శించారు.. రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేస్తున్నారా.. లేక ప్రధాని.. జగన్‌ని మోసం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.. అసలు, ప్రధానితో ఏం మాట్లాడారో ఆడియో, వీడియో ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మీరు జరిపే చర్చలకు సంబంధించి వీడియోలు రావు అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాటం చేసింది మేమేనని స్పష్టం చేసిన టీడీపీ ఎమ్మెల్యే.. ఆ రోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాటం చేశాం.. రాజీనామాలు చేయమని ఆ రోజు ఉచిత సలహాలు ఇచ్చారు.. మరి మీరు ఇప్పుడు రాజీనామాలు చేసి పోరాడండి అని సవాల్ చేశారు. ఇక, సీఎం జగన్ ప్రత్యేక హోదాపై కచ్చితంగా మాట్లాడి తీరాలని డిమాండ్ చేశారు పయ్యావుల కేశవ్.. మీతో నరేంద్ర మోడీ ఏమన్నారో.. మీరు దానికి ఏం చెప్పారో వెల్లడించాలని కోరారు.. మీరు పాల్గొనే జూమ్ మీటింగ్ లింక్ బయటకు పెట్టండి.. అందరికీ తెలియాలి.. అప్పుడే ఎవర్ని ఎవరు మోసం చేస్తున్నారో తెస్తులందని నిలదీశారు పయ్యావుల కేశవ్.