Payyavula Keshav: ఏపీ కేబినెట్ సమావేశంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో నిర్ణయాలు ప్రజల కోసం కాకుండా అయిన వారి కోసమే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు తమ మెడకు చిక్కుకోవని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన సుమారు 20 వేల మెగావాట్ల మేర హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని.. హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను అస్మదీయులకు కట్టబెడుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను తాము బ్యాక్ గ్రౌండ్‌గా ఉన్న కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
టెండర్ల ద్వారా లేదా బిడ్డింగ్ ద్వారా హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను కేటాయింపులు జరపాలని.. నామినేషన్ విధానంలో హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏ విధంగా కట్టబెడతారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. నెడ్ క్యాప్‌తో సర్వే చేయించి.. నెడ్ క్యాప్ సంస్థ గుర్తించిన స్థలాల్లో హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రారంభించారని.. ప్రభుత్వ సొమ్ముతో సర్వేలు చేయించుకుని.. టెండర్లు పిలవకుండా ప్రాజెక్టులు నామినేటెడ్ పద్దతిన కట్టబెట్టేస్తారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా టెండర్లను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగంపై గతంలో తాను చేసిన ఆరోపణలకు ఏ మాత్రం సమాధానం చెప్పలేదని.. ఇప్పుడైనా చెప్పాలని పయ్యావుల డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు షరతులు పెడతారని.. షరతులు పెట్టి టెండర్లు ఖరారు చేయాల్సిన చోట నామినేటెడ్ పద్దతిలో కట్టబెట్టేస్తున్నారని పయ్యావుల విమర్శలు చేశారు. బంధువులనే బ్యాక్ గ్రౌండ్ ఉన్నందుకే.. ఆ కంపెనీలకు ప్రభుత్వం హైడ్రో పంప్డ్ ప్రాజెక్టులు కట్టబెట్టినట్టుగా కన్పిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం పీఏసీని నిర్వీర్యం చేస్తోందని.. పీఏసీలోని భర్తీలను కూడా ఫిలప్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు కోరం లేకుండా చూడడం ద్వారా పీఏసీ సమావేశాలు జరగనిచ్చేవారు కాదన్నారు. కొంత కాలం వేచి చూస్తానని.. అప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి సానుకూలత లేకుంటే పీఏసీ ఛైర్మన్ హోదాలో తానే సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు.
Read Also: Udhayanidhi Stalin: మంత్రి కాబోతున్న యంగ్ హీరో!
ఈ ప్రభుత్వానికి 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను జరిపే దమ్ముందా అని పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. మూడు రోజుల పాటు సమావేశాలు పెట్టడం.. తమకు కావాల్సిన బిల్లులను ఆమోదింపచేసుకుని వెళ్లిపోవడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని చురకలు అంటించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారని.. విండ్ పవర్.. సోలార్ పవర్ కొనుగోళ్లల్లో టీడీపీ అనేక అక్రమాలు చేసిందని ప్రమాణస్వీకార వేదిక మీదే జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. అసెంబ్లీలో కూడా ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టుగా చూపించారన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందా.. లేదా.. అనేది నాలుగేళ్ల తర్వాత కూడా ఏం తేలలేదన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోళ్లల్లో సూది మొనంత అవినీతి జరగలేదని హైకోర్టు తేల్చి చెప్పిందన్నారు. హైకోర్టు చెప్పడమే కాదు.. ప్రభుత్వమూ అంగీకరించిందని.. విద్యుత్ సంస్థలకు చెల్లింపులు ప్రారంభించారన్నారు. సీఎం హోదాలో జగన్ చేసిన ప్రకటనల వల్ల రాష్ట్రంపై నమ్మకం కొల్పోయిందని పయ్యావుల అన్నారు.వ్యవసాయ రంగానికి సోలార్ విద్యుత్ అయిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టేందుకు టెండర్లు పిలిచారని.. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల భారం ప్రజలపై పడుతోందన్నారు. సెకీ పిలిచిన టెండర్లను అన్ని రాష్ట్రాలు తిరస్కరిస్తే.. దాన్ని జగన్ ప్రభుత్వం ఖరారు చేసిందని తెలిపారు. దేశంలో అతి ప్రయోగత్మకంగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో ప్రారంభించారని పయ్యావుల అన్నారు.
