Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా విశాఖ పర్యటనలోనే ఉన్నారు. పోలీసుల ఆంక్షల కారణంగా నోవాటెల్ హోటల్‌లో పవన్ ఉండిపోయారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, పార్టీ నేతలతో పలు మార్లు కీలకంగా మాట్లాడిన అనంతరం ఆయన సోమవారం మధ్యాహ్నం విశాఖ నుంచి విజయవాడ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. దీంతో ఆయన ప్రయాణించే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. హోటల్ వద్ద గుమికూడిన జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
Read Also: Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని
కాగా విజయవాడలో పవన్ కళ్యాణ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోసం జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం గవర్నర్ విజయవాడలో లేరు. ఆయన వేరే టూర్‌లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం గవర్నర్ తిరిగి విజయవాడ చేరుకుంటారని సమాచారం అందుతోంది. దీంతో గవర్నర్ అపాయింట్‌మెంట్ లభిస్తే పవన్ ఆయన్ను కలిసి వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. విశాఖలో తనను పోలీసులు నిర్బంధించడంపై గవర్నర్‌కు జనసేన అధినేత పవన్ లేఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.