NTV Telugu Site icon

Janasena Party: పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తారా?

Pawan Kalyan Tirupathi

Pawan Kalyan Tirupathi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు. అయితే రెండు స్థానాల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా సినిమా అభిమానాన్ని ఓట్ల రూపంలోకి ఆయన మలుచుకోలేక చతకిలపడ్డారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కొత్త స్థానం నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది.

MP Guru Murthy: తిరుపతి రైల్వేస్టేషన్ కొత్త డిజైన్‌లపై అభ్యంతరాలు

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి బరిలోకి దిగనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తిరుపతిలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, 2009లో చిరంజీవి కూడా ఇక్కడి నుంచే గెలవడంతో పవన్ తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసైనికులు ఒత్తిడి తెస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అయితే బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీ ఓట్లు దూరమవుతాయనే చర్చ కూడా జరుగుతోంది. 2009 ఎన్నికల్లో చిరంజీవి 15,930 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు కూడా పవన్‌ను అంతకు మించి ఎక్కువగానే ఓట్లు వస్తాయంటూ జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.

కాగా జనసేనాని తిరుపతిలో పోటీ చేస్తే తాము అండగా నిలబడతామని జనసేన నేత కిరణ్ రాయల్ సోషల్ మీడియాలో ట్వీట్ చేయగా అది వైరల్‌ అవుతోంది. తిరుపతి ఎమ్మెల్యేగా జనసేనానే ఉండాలనేది జనసైనికుల కోరిక అని.. లక్ష ఓట్ల మెజారిటీతో పవన్‌కు తిరుపతి ఎమ్మెల్యే పదవిని గిఫ్ట్‌గా ఇస్తామని కిరణ్ రాయల్ ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తిరుపతిలో పోటీ చేసే విషయంపై ఊ అంటారో లేదా ఊహూ అంటారో వేచి చూడాలి.