ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు మధ్యాహ్నం వరకు విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బాధ్యతల నుంచి తప్పించడం తనకు విస్మయం కలిగించిందన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావొచ్చు… కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరమేంటని పవన్ ప్రశ్నించారు.
గౌతమ్ సవాంగ్ బదిలీపై గల కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇటీవల విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్‌పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని పవన్ స్పష్టం చేశారు. సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపి ఇతర ఉ్ననతాధికారులను హెచ్చరించి అదుపు చేయవచ్చని జగన్ ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. సవాంగ్ బదిలీ తీరు చూస్తుంటే గతంలో సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా పక్కకు తప్పించడం గుర్తుకు వస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
