Site icon NTV Telugu

Pawan Kalyan: విజయానికి దూరమైన వారికి భరోసా.. మోడీ ఘనత

Pawan Modi

Pawan Modi

కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు అత్యద్భుత ప్రతిభ కనబర్చారు. అయితే కొందరు అనుకోని పరాజయం పాలైతే వారిని ఓదార్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీని అభినందనలతో ముంచెత్తారు. పరాజయంలో ఓదార్పే ఊపిరి. ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శనీయం అన్నారు పవన్ కళ్యాణ్. విజయాలు వరించినప్పుడు పొగడ్తలతో ముంచెత్తేవారు కొల్లలుగా ఉంటారు. అదే అపజయం వెంటాడినపుడు ఓదార్చేవారు అరుదుగా మాత్రమే కనిపిస్తారు. నిజానికి సత్ఫలితాలు వచ్చినప్పుడు చేసే సన్మానాలు కంటే పరాజయంలో వెన్నంటి ఉన్నవారే గొప్పగా కనపడతారు.

మన ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు చెప్పడం, శుభాకాంక్షలు అందచేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తేవడానికో, దేశానికి విజయాలు సాధించి పెట్టడానికో పరితపిస్తూ.. పరిశ్రమిస్తూ త్రుటిలో విజయానికి దూరమైన వారికి భరోసాగా నిలవడం నన్నెంతో ఆకట్టుకుంది.

బ్రిటన్ లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడా పోటీలలో మహిళా కుస్తీ పోటీలో బంగారు పతకం చేజారిపోయి కాంస్యం మాత్రమే దక్కించుకున్న పూజ గెహ్లాట్ ను మోడీ ఓదార్చిన తీరు అద్భుతం. దేశానికి బంగారు పతకం అందించలేకపోయానని, దేశ ప్రజలు క్షమించాలని విలపిస్తున్న వీడియోను చూసి మోడీ స్పందించిన తీరు మానవీయంగా ఉంది. “నీ విజయం దేశానికి వేడుకలను తీసుకొచ్చింది.. క్షమాపణలు కాదు. నీ విజయాన్ని చూసి ఉత్తేజితులమయ్యాం.. నీ విజయం మాకో అద్భుతం” అని మోడీ ఆమెకు పంపిన సందేశం కదిలించేలా ఉంది.

టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మన దేశ హాకీ మహిళ టీం ఫైనల్ చేరుకోవడంలో విఫలమైనప్పుడు మన క్రీడాకారిణులు మైదానంలో విలపించిన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఆ సందర్భంలో కూడా మోడీ మన క్రీడాకారిణులను ఇలాగే ఓదార్చారు. వారికి ఫోన్ చేసి తండ్రిలా అనునయించారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ విఫలమైన సందర్భాల్లోనూ మోడీ మన శాస్త్రవేత్తలకు గుండెధైర్యాన్ని నింపారు.

ఈ ప్రాజెక్టులోని విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగడంలో విఫలమైనప్పుడు ప్రత్యర్ధులు సోషల్ మీడియా వేదికగా మన శాస్త్రవేత్తలను గేలి చేశారు.. అవమానించారు. అటువంటి క్లిష్ట సమయంలో ఇస్రో చీఫ్ శ్రీ శివన్ ను గుండెలకు హత్తుకుని పరాజయాన్ని మరిచిపోండి. భవిష్యత్తుపై దృష్టిపెట్టండని చెప్పి శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్నిచ్చారు. ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలగాలని కోరుకుంటున్నాను. పూజ గెహ్లాట్ తో పాటు కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలకు, పాల్గొన్న మన క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్.. 10 మంది శ్రీలంక క్రీడాకారుల మిస్సింగ్‌..

Exit mobile version