Site icon NTV Telugu

Pawan Kalyan: వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందా?

Pawan Kalyan

Pawan Kalyan

ఏపీలో ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. గతంలో పొత్తుల గురించి మాట్లాడిన పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల విమర్శలపై అదేరేంజ్‌లో పవన్ ఫైరయ్యారు. మరోసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పునరుద్ఘాటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే అది వైసీపీకే లాభం. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు ఒక కూటమికి పడితే అది లాభం అవుతుంది. ఓటు చీలిపోతే వైసీపీ అభ్యర్ధులు గెలుస్తారు. స్వల్ప ఓట్ల తేడాతో విపక్ష పార్టీల క్యాండిడేట్లు ఓడిపోతారు. వైసీపీయేతర కూటమి ఏర్పడితే ఓట్లన్నీ ఆ కూటమికి పడతాయనేది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతే, వైసీపీ మళ్లీ వస్తే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోతుందని పవన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడాలి తప్ప తన వ్యక్తిగత ఎదుగుదల కోసం ఏ రోజూ చూడలేదన్నారు పవన్.

అధికార వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమని పవన్ ఇంతకుముందే ప్రకటించారు. అసలు ఏ పార్టీ ఎవరితో కలిస్తే బాగుంటుంది. ఎవరికి లాభదాయకంగా వుంటుందనేది ఆయా పార్టీలకు సంబంధించింది. అయితే దత్తపుత్రుడు పవన్ అంటూ వైసీపీ నేతలు, మంత్రులు కూడా పొత్తుల గురించి విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన కలిపి పోటీచేస్తాయంటూ వైసీపీ మంత్రులే ఒక నిర్దారణకు వచ్చేశారు.మేం ఎవరితో కలవాలో, కలవకూడదో మా ఇష్టం. మధ్యలో మీకేం కష్టం అంటూ పవన్ ఎద్దేవా చేశారు.

పవన్‌కల్యాణ్ పొత్తుల విషయంలో మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అవసరమైతే బీజేపీ అధిష్టానాన్ని సైతం పొత్తులకు ఒప్పిస్తానని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను వారికి అర్థమయ్యేలా వివరించి…పొత్తుల విషయంలోనూ వారిని ఒప్పిస్తానన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలని వారిని ఏవిధంగా ఒప్పించానో….ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకు సాగుతానంటున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వివిధ అంశాలపై ఆయన విలేఖర్లతో పిచ్చాపాటీగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

పవన్ విలేఖర్లతో మాట్లాడుతుండగానే విద్యుత్ పోయింది. సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుతురులోనే పవన్ మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులకు ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుందన్నారు.‘వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వం’ అన్న నాలుగే నాలుగు పదాలు విని ఆ పార్టీ నాయకులు ఎందుకు అంత భయపడుతున్నారు. రాష్ట్రం బలంగా ఉండటమే ముఖ్యం. రాష్ట్రం బలమే జనసేనకు బలం అన్నారు పవన్. ఇటు తెలంగాణలో పోటీ గురించి కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో 20 నుంచి 30 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్ని తీసుకొని ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. ఏపీ జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని పవన్‌ వాఖ్యానించారు. మొత్తం మీద పవన్ తాజా వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.

మంత్రి కొట్టు సత్యనారాయణ ఏమన్నారంటే…

పవన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైరయ్యారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా పవన్ కళ్యాణ్ చేస్తానంటున్నారు. పవన్ నిర్ణయాలపై జనసేన ఓటర్లలో వ్యతిరేకత ఉంది. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు టిడిపి, బిజేపి, జనసేన కార్యకర్తలే. టీడీపీ కార్యకర్తలు సైతం వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు.వైసీపీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని బీజేపి చెబుతోంది. ఇపుడు పవన్ బీజేపిని ఒప్పిస్తారా లేక టీడీపీని ఒప్పిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు.

Bala Krishna : అభిమానులకు.. తెలుగుజాతికి.. నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి….

Exit mobile version