Pawan Kalyan : మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, పంటనష్టం చోటుచేసుకున్నప్పటికీ, ముందస్తు చర్యల వల్ల నష్టం చాలా వరకు తగ్గించగలిగామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తుఫాన్‌కు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన ముందుచూపు, సమయోచిత నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో తుఫాన్ ప్రభావిత పంటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కూడా ఆయన వీక్షించారు. “మొత్తం 46 వేల హెక్టార్లలో వరి పంట, అలాగే 14 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో సమర్థవంతంగా పని చేశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోంది. పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాం.’ అని ఆయన పేర్కొన్నారు.
ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రూ.3 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. డ్రైన్ల పూడికతీతల ద్వారా నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకున్నాం. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి – ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తాను.” అని ఆయన అన్నారు. అలాగే, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పాడైన రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేస్తామన్నారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
TTD Laddu : కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర.. సిట్ దర్యాప్తులో వెలుగులోకి కీలక అంశాలు
