Site icon NTV Telugu

Pawan Kalyan: ఇప్పటం బాధితులకు అండగా పవన్‌ కల్యాణ్‌.. ఆర్థిక సాయం ప్రకటన

Pawan Kalyan

Pawan Kalyan

ఇప్పటం గ్రామ బాధితులకు తాను అండగా ఉంటానంటూ ఇప్పటికే ఆ గ్రామంలో పర్యటించిన బాధితులకు ధైర్యం చెప్పిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు బాధితులకు ఆర్థికంగా కూడా భరోసా కల్పించేందుకు సిద్ధం అయ్యారు.. ఒక్కో బాధితుడికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు.. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతకు గురైన వారికి రూ. లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ విషయాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని పవన్ నిర్ణయించారు.. మార్చి 14 తేదీన ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి శుక్రవారం జేసీబీలను పెట్టి, పోలీసులను మోహరింపచేసి ఇళ్లు కూల్చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Andhra Pradesh Crime: ప్రాణాలు తీసుకుంటున్న ప్రేమికులు.. ఒకే రోజు రెండు జంటలు ఆత్మహత్య

ఇక, ఈ ఘటన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు నాదెండ్ల మనోహర్‌.. ఘటన జరిగిన మరునాడే పవన్ కల్యాణ్‌ ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారు.. ఇళ్లు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటం వాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించిపోయారని.. బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. నైతిక మద్దతుతోపాటు ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కల్యాణ్‌ స్వయంగా అందచేస్తారని తెలిపారు నాదెండ్ల మనోహర్‌.. కాగా, జనసేన సభకు స్థలం ఇచ్చారనే ఇప్పటం గ్రామంపై కక్షగట్టి కూల్చివేతలు మొదలుపెట్టారని పవన్‌ విమర్శించిన విషయం తెలిసిందే.. గాంధీజీ, నెహ్రూ గారు, కలాం గారి విగ్రహాలు కూల్చి… వైఎస్సార్ విగ్రహం మాత్రం ఉంచారు. కూల్చివేతలతో పాలన మొదలుపెట్టిన ప్రభుత్వం కచ్చితంగా కూలుతుంది. రోడ్డు మీద గుంతలు పూడ్చలేరుగానీ.. రోడ్లు విస్తరిస్తారట అంటూ ఎద్దేవా చేశారు. కాగా, ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని కూడా కూల్చివేసిన విషయం విదితమే.

కాగా, శనివారం ఉదయం ఇప్పటం గ్రామంలోని కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధిత ప్రజలతో మాట్లాడాలని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్‌ను కార్యాలయం గేటు దగ్గరే ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు.. ఇప్పటం వెళ్లడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు.. దీంతో.. కాలినడకన వెళ్తానని పవన్ కల్యాణ్‌ వాహనం దిగి నడక ప్రారంభించారు. ఆయనను పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అనుసరించారు. పోలీసు సోదరులు అడ్డుకున్నా.. మౌనంగా చేతులు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ నడవాలని శ్రేణులకు సూచించారు. పోలీసుల కష్టాలు తనకు తెలుసు అన్నారు. అయితే, కొంత దూరం వెళ్లిన తర్వాత పోలీసులు ఇప్పటం వెళ్లేందుకు అనుమతించారు. ఇక, ఇప్పటం చేరుకున్న పవన్.. కాలి నడకన అక్కడ తిరుగుతూ.. కూల్చివేసిన ఇళ్లను పరిశీలించారు.. బాధితులతో మాట్లాడారు.. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. అందులో భాగంగా ఇప్పుడు ఆర్థికసాయాన్ని కూడా ప్రటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version