Site icon NTV Telugu

Pawan Kalyan: వైసీపీపై పవన్ ట్వీట్ల వర్షం.. కారు టు కట్‌డ్రాయర్ అంటూ..!!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేనకు చెందిన వారాహి వాహనంపై వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతల ఆరోపణలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల రూపంలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు కారు టు కట్‌డ్రాయర్ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో టిక్కెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతల లంచాలు, వేధింపుల కారణంగా కారు నుంచి కట్‌డ్రాయర్ కంపెనీల వరకు పక్క రాష్ట్రానికి తరలిపోయాయని పవన్ ఆరోపించారు. మరో ట్వీట్‌లో వైసీపీ నేతలు ఈర్ష్యతో రగిలిపోతున్నారని.. నానాటికీ వాళ్ల ఎముకలు కుళ్లిపోతున్నాయని విమర్శలు చేశారు. ఈర్ష్యతో బాధపడే విద్యార్థులు ఇతరుల వస్తువులను నాశనం చేసినప్పుడు తమ స్కూల్ ఓ టీచర్ ఒక సూక్తిని పదేపదే చెప్పేవారని.. హృదయంలో శాంతి ఉంటే ఆ దేహానికి ఆయుష్షు పెరుగుతుంది.. కానీ హృదయంలో కుళ్లు కుతంత్రాలు ఉంటే వారి ఎముకలు కుళ్లిపోతాయి అని చెప్పేవారంటూ పవన్ వివరించారు.

మరో ట్వీట్‌లో ఆలివ్ గ్రీన్ రంగులో ఉన్న కారు, బైక్ ఫొటోలను కూడా పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. నియమ నిబంధనలు కేవలం పవన్ కల్యాణ్ కోసమే అంటూ కౌంటర్ వేశారు. అటు పచ్చని చెట్లతో కూడిన ఓ గార్డెన్ ఫొటోను పోస్టు చేసిన పవన్… ఇందులో మీకు ఏ రకం పచ్చదనం నచ్చింది వైసీపీ అంటూ పవన్ వెటకారం ప్రదర్శించారు. అంతేకాకుండా ఒనిడా ప్రకటనను కూడా పవన్ ప్రస్తావించారు. పొరుగువాడికి కడుపుమంట, యజమానికి గర్వకారణం అని ఉన్న ఒనిడా ప్రకటనను పోస్ట్ చేశారు. ఈ యాడ్ అంటే తనకు చాలా ఇష్టమని పవన్ పేర్కొన్నారు. అటు పవన్ కళ్యాణ్ ట్వీట్లకు వైసీపీ అభిమానులు కౌంటర్లు పోస్ట్ చేస్తున్నారు. ఏపీ అభివృద్ధిని పవన్ చూడలేకపోతున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version