కొన్ని రోజుల నుంచి ఏపీలో పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. తన పర్యటనలో భాగంగా ‘అందరూ కలిసి ముందుకు రావాలి’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి.. ఈ పొత్తు వ్యవహారం అగ్గి రాజేసుకుంది. దీంతో.. ఏపీ నేతల నోట పొత్తు మాటలే వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అంశం మీదే ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.
తమ సీఎం జగన్‌ని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకపోవడం వల్లే, చంద్రబాబు పొత్తుల్ని నమ్ముకున్నారంటూ వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎన్నికలు వచ్చేలోపు చంద్రబాబు, పవన్ మరోసారి కుమ్మక్కవడం ఖాయమని జోస్యం చెప్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని చంద్రబాబు స్పష్టత ఇచ్చినప్పటికీ.. పొత్తు విషయంపై చర్చలు మాత్రం ఆగట్లేదు. ఈ నేపథ్యంలోనే జనసేనాధినేత ట్విటర్ మాధ్యమంగా ఈ పొత్తు అంశంపై స్పందిస్తూనే.. వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు.
‘‘శ్రీలంక నుంచి తమిళనాడుకి గంట దూరం.. శ్రీలంక పరిస్థితికి, ఏపీకి కూతవేటు దూరంలోనే ఉందని పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అసలు ఇంతవరకూ లేని పొత్తుల గురించి విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ విమర్శల్ని, అలాగే గడప గడపకు ఎమ్మెల్యేలను పంపడం ఆపేసి.. చేసిన అప్పుల నుంచి ఏపీని దూరం చేసేందుకు ప్రయత్నించమని వైసీపీ ప్రభుత్వానికి పవన్ హితవు పలికారు.
శ్రీలంక నుంచి తమిళనాడుకి గంట దూరం- శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం.ఇంకా లేని పొత్తులు
గురించి విమర్శించటం,గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు చెయ్యవలసింది,మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్‌ని దూరం జరిపే ప్రయత్నం చెయ్యండి.
Gravitas Link:https://t.co/b5S8kN721c pic.twitter.com/GoaUa5g0UR— Pawan Kalyan (@PawanKalyan) May 16, 2022
