జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ టార్గెట్ గా పవన్ కళ్యాణ్ మరోసారి రెచ్చిపోయి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మనవాడు.. మనవాడు అని చాలా మంది వైసీపీ మద్దతుదారులు అంటున్నారు. కులం కాదు గుణం ప్రధానం. మనవాడంటూ మీరు తెచ్చిచ్చిన అధికారంతో రాష్ట్రం ఏమైందో చూడండి. రాష్ట్రం ఈ విధంగా కావడానికి వైసీపీ మద్దతుదారులకూ బాధ్యత ఉంది. వైసీపీ మద్దతుదారులు కూర్చొని ఆలోచించండి. ఇప్పటి వరకు సామాజిక కార్యకర్తగానే పని చేశాను.. ఇప్పటి నుంచి రాజకీయం మొదలు పెడతాను. రాజకీయం అంటే ఏంటో నేను చూపిస్తా.. ఓటమి భయం, ప్రాణభయం లేని వాణ్ణి కాబట్టే తుపాకీ ఇచ్చేశాను’.
భవిష్యత్తులో ప్రభుత్వం మారడం ఖాయం.. 151 సీట్లు వచ్చిన వైసీపీకి 15 సీట్లే రావచ్చు అన్నారు పవన్. 150 దేవాలయాలపై దాడులు చేస్తే ప్రభుత్వం పట్టించుకోదా..? ఉదయం లేచింది మొదలు.. వైసీపీ కమ్మ కులాన్ని తిడుతుంటే.. వాళ్లు మీ వర్గాన్ని తిట్టరా..? వైసీపీ నేతలకు చెబుతున్నాను.. వ్యూహం వేస్తున్నాను. ఏపీలో పరిస్థితిని ఢిల్లీ వాళ్లకి చెప్పాను. వైసీపీ దుష్టపాలనకు అంతమొందిచాల్సిన సమయం ఆసన్నమైంది’ అని వైసీపీ పాలనపై పవన్ ధ్వజమెత్తారు.