NTV Telugu Site icon

Pawan Kalyan: నాకు పదవి ముఖ్యం కాదు.. పదవి కావాలంటే ఎప్పుడో ఎంపీ అయ్యేవాడిని

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Key Comments in independence day Celebrations: పదవులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాను పదవే కావాలని కోరుకుంటే 2009లోనే ఎంపీని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలపై తాను ప్రశ్నిస్తుంటే.. సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని పవన్ ఆరోపించారు. ఇష్టానుసారం మాట్లాడే వైసీపీ నేతలకు తాను జవాబు చెప్పగలనని పవన్ అన్నారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారనే విషయం తనకు తెలుసు అని.. ప్రధాని ముందు వైసీపీ ఎంపీలు కనీసం నోరు కూడా మెదపలేరని ఎద్దేవా చేశారు.

Read Also: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?

అటు పార్టీని నడిపేందుకు వైసీపీ నేతలకే అర్హత ఉందా తమకు లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పవన్ విమర్శలు చేశారు. జనసేన అధికారంలోకి వస్తేనే వ్యవస్థలు బలోపేతం అవుతాయని పవన్ అన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు బలంగా మారలేవని అభిప్రాయపడ్డారు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు ఎలా చెప్తారని పవన్ నిలదీశారు. గుడివాడలో ఇసుక దందా, చిత్తూరు జిల్లాలో తమ పార్టీ నేతలపై ప్రభుత్వం అన్యాయంగా కేసులు బనాయిస్తోందని పవన్ ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామన్నారు. భీమ్లా నాయక్ అనే సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుంచి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని పవన్ చురకలు అంటించారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు.

Show comments