ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జనసేన పార్టీ అభిప్రాయపడుతోంది. వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోంది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి ఆయన బస్సు యాత్రను ప్రారంభిస్తారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపడతారని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ ఎండగడతారని.. జగన్ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. మరోసారి జగన్ అధికారంలోకి రాకూడదని ప్రజలు భావిస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రణాళిక లేని పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధానంగా జగన్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని.. ఈ ప్రభుత్వాన్ని నడపడం చేతకాక చేతులేత్తేశారని పేర్కొన్నారు. అందుకే వచ్చే ఏడాది మార్చిలో జగన్ ఎన్నికలకు వెళుతున్నారని.. దీనిపై తమకు పక్కా సమాచారం ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు.