ఏపీలో పదవతరగతి పరీక్షా ఫలితాలు అందరికీ షాకిచ్చాయి. లక్షలాదిమంది ఫెయిలయ్యారు. ప్రభుత్వం అసమర్థత వల్లే ఇలా జరిగిందని విపక్షాలు మండిపడుతున్నాయి. పదవతరగతి ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇంట్లో తల్లితండ్రులదే తప్పు అని నెపం వేస్తారా? అని ఆయన అన్నారు.
10 గ్రేస్ మార్కులిచ్చి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి. ఉచితంగా రీ కౌంటింగ్ నిర్వహించాలి.. ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకీ ఫీజులు తీసుకోకూడదు. పట్టుమని పది పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేరు. గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగాను ఉండలేరు. ధరలను అదుపులో ఉంచి ప్రజలను సంతోషపెట్టలేరు. విద్యార్థులకైనా ఉపశమనం కలిగించాలన్నారు పవన్ కళ్యాణ్.
కనీసం పిల్లలకు సరైన చదువు చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా..? పదో తరగతి పరీక్షా ఫలితాలు చూస్తే ఆ పని కూడా చేయలేని చేతకాని ప్రభుత్వమని మరోసారి స్పష్టం అయిందన్నారు పవన్. తెలుగువారందరికీ వైసీపీ ప్రభుత్వంపై రోత కలుగుతోంది. విద్యా వ్యవస్థలో జగన్ సర్కార్ లోపభూయిష్ట విధానాలను చరిత్ర దాచి పెట్టుకోదన్నారు పవన్ కళ్యాణ్.
