Papikondalu: గోదావరిపై పాపికొండల యాత్ర ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కొంతకాలంగా గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బోట్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరుత్సాహం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పాపికొండలు వెళ్లేందుకు టూరిజం బోట్లకు అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో భక్తులు ఎక్కువగా గోదావరి నదిపై ప్రయాణించి భద్రాచలం వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఈ మేరకు తమ బోట్లను నడిపేందుకు, పర్యాటకులను పాపికొండలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రైవేట్ టూరిజం బోట్ ఆపరేటర్లు ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ లెవల్‌కు 30 మీటర్ల మేర నీటిని ఉంచడం ద్వారా రివర్ రూట్ మ్యాప్‌ను నిర్ణయించవచ్చని సూచించారు.
Read Also: Thief Returned Stolen Things: దేవుడి దెబ్బ.. దొంగ అబ్బ.. చోరీ చేసిన సొత్తు రిటర్న్స్
పోలవరం ప్రాజెక్ట వద్ద నీటిమట్టం 28 మీటర్ల స్పిల్ లెవల్‌లో ఉంటే టూరిజం బోట్లను నడిపేందుకు అధికారులు అనుమతులు ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వరదలు కొనసాగుతున్నాయి. ఫలితంగా నదిలో ఈ స్థాయిలో ప్రయాణించడం వల్ల పర్యాటకుల భద్రతకు ఎటువంటి ప్రమాదం ఉండదని, స్పిల్ లెవల్‌కు రెండు మీటర్లు పెంచాలని బోట్ నిర్వాహకులు అధికారులను అభ్యర్థించారు. ఈ మేరకు తగినంత లోతు నీరు, సురక్షితమైన మార్గాన్ని మేం తనిఖీ చేస్తున్నామని.. బోట్ ఆపరేటర్లు ఈ మార్గం నుంచి తప్పుకోకుండా చూసుకోవాలని అధికారులు చెప్తున్నారు. త్వరలో బోట్లను నడపడానికి అనుమతిని జారీ చేస్తామని చెప్పారు. కాగా తమ వ్యాపారంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా సిబ్బందికి వేతనాలు చెల్లించాలని.. ప్రస్తుతం బోట్లు నడపకపోవడం వల్ల తమపై ఆర్థిక భారం పడుతోందని బోట్ల యజమానులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బోట్లు నడిపేందుకు అనుమతించాలని కోరుతున్నారు.
