OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!

Westgodavariycp

Westgodavariycp

అత్యంత కీలకమైన ఆ ఉమ్మడి జిల్లాలో వైసీపీ తరపున గట్టిగా వాయిస్‌ వినిపించే నాయకుడు లేకుండా పోయారా? అధికారంలో ఉన్నప్పుడు లబ్దిపొంది, పదవుల్లో ఉన్నవాళ్ళు సైతం ఇప్పుడు పోరాటాన్ని మర్చిపోయారా? క్షేత్ర స్థాయి బలం ఉన్నా…దాన్ని సరిగ్గా వాడుకోవడంలో విఫలమవుతున్న ఆ నాయకులు ఎవరు? వాళ్ళ గురించి పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?

2024 ఎన్నికల ఓటమి తర్వాత కీలకమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో YSR కాంగ్రెస్ పార్టీ… ఇప్పటికీ కోలుకోలేకపోతోందన్న అభిప్రాయం గట్టిగా ఉంది. ఇందుకు గ్రూపు తగాదాలు ఒక కారణమైతే.. జిల్లాలో కేవలం అధినేతను మెప్పించడానికి ప్రదక్షిణలు చేసే సీనియర్ లీడర్లే తప్ప.. క్షేత్రస్థాయిలో ప్రభావం చూపగలిగే వాళ్ళు లేకపోవడం మరో కారణమని అంటున్నారు. చాలామంది మాజీలు ఉన్నప్పటికీ… రాజకీయ ప్రభావం చూపే విషయంలో అంతంత మాత్రంగానే ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్రౌండ్‌లో పార్టీకి కావాల్సిన బలం ఉన్నప్పటికీ…. దాన్ని సానుకూలంగా మలచడంలో మాత్రం మోస్ట్ సీనియర్ లీడర్లు విఫలమవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. పదవుల్లో లేని మాజీల సంగతి అలా ఉంచితే… ఇప్పుడు పదవులు ఉన్నవాళ్ళు సైతం పనితనం చూపలేకపోవడం మరో సమస్యగా మారిందని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్ ఉన్నారు. కానీ… పార్టీ ఆశించిన స్థాయిలో వాళ్లిద్దరూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారని ఫ్యాన్‌ కేడరే అంటోంది. అధికార కూటమి వైఫల్యాలు అనేకం ఉన్నప్పటికీ వైసిపి తరఫున గళం వినిపించే విషయంలో జిల్లా ఎమ్మెల్సీలు వెనుక పడ్డారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో.. తామన్నామంటూ కేడర్‌కు కూడా భరోసా కల్పించలేకపోతున్నారని అంటున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేతను మెప్పించి పదవులు సొంతం చేసుకున్న ఇద్దరూ… ఇప్పుడు దూకుడుగా ఉండి పార్టీ క్యాడర్‌కు ఎందుకు భరోసా కల్పించలేకపోతున్నారన్న ప్రశ్నలు సొంత వాళ్ళ నుంచే వస్తున్నాయి. కవురు శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి కంటే ముందు డిసిసిబి చైర్మన్, జడ్పీ చైర్మన్, పాలకొల్లు పార్టీ ఇన్చార్జ్…. ఇలా చాలా పదవులే ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ నేతలు కొందరు దీన్నే ఉదహరిస్తూ….ఆయనకు పనితనం కంటే ఎక్కువగా పదవులు ఇచ్చారని విమర్శిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ తరహా చర్చలు జరిగినా… ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో…అధినేత తనపై ఎంత నమ్మకం ఉంచారన్న విషయాన్ని మర్చిపోయిన కవురు ఒక రకంగా ద్రోహం చేస్తున్నారంటూ విరుచుకుపడేవాళ్ళు సైతం వైసీపీలో ఉన్నారు.

అధినేత చుట్టూ తిరుగుతూ… ఆయన్ని మెప్పించి పదవులు పొందడం తప్ప క్షేత్రస్థాయిలో పార్టీకి అవసరమైన పని చేయడం లేదన్నది ఆయన మీదున్న ప్రధానమైన అభియోగం. కానీ… కవురు అనుచర వర్గం వెర్షన్ మరోలా ఉంది. జిల్లాలో ఉన్న సీనియర్ నేతలతో పాటు అధ్యక్షుడిగా ఉన్న నేత ఆయన స్వరం వినిపించకుండా తొక్కేస్తున్నారని, అందుకే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ సైలెంట్ అవుతున్నారంటూ చెప్పుకొస్తున్నారు.

ఇందులో వాస్తవం ఎంత ఉందన్న సంగతి అలా ఉంచితే… అసలు యుద్ధమే చేయకుండా సాకులు వెదకడం కరెక్ట్‌ కాదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఇక 2014 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వంకా రవీంద్రనాథ్ పరిస్థితి అంతేనట. పార్టీ కోసం గతంలో పడిన కష్టాన్ని గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు అధినేత. అయితే జిల్లాలో ఉన్న సమస్యలపై గళం విప్పడంలో ఆయన తడబడుతున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ తరఫున గట్టిగా గళం వినిపించే నేతలకి కరువొచ్చి పడిందన్నది ఫ్యాన్‌ వర్గాల బాధ.ఇప్పటికైనా పదవుల్లో ఉన్న నాయకులు అధినేత ఆశిస్తున్న స్థాయిలో పనిచేస్తే వాళ్ళకే మంచిదంటూ చురకలంటిస్తున్నారు కొందరు వైసీపీ లీడర్స్‌.