Site icon NTV Telugu

Off The Record: ఆ మాజీ మంత్రి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారా..?

Dhadi Veera Bhadra Rao

Dhadi Veera Bhadra Rao

Off The Record:  ఒకప్పుడు ఆ మాజీ మంత్రి చుట్టూ పవర్‌ పాలిటిక్స్‌ తిరిగేవి. రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగారో.. అన్ని ఎదురు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు ఒక్కఛాన్స్ దొరికితే పూర్వ వైభవం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. రాజకీయ వనవాసం వీడే సంకేతాలు కనిపిస్తున్నట్టు లెక్కలేస్తున్నారట. మరి.. ఆ సీనియర్‌కు హైకమాండ్ అవకాశం ఇస్తుందా? లేక గతంలో జరిగిన తప్పిదాలకు బలి చేస్తుందా? ఎవరా నేత? ఏమా కథా?

ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకమే. హోరా హోరీ పోటీకి కేరాఫ్ అడ్రసైన ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు రాజకీయ ఆధిపత్యం కోసం పోరాడారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా,మంత్రిగా, శాసనమండలి ప్రతిపక్షనేతగా పని చేసిన అనుభవం వీరభద్రరావుది. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కొన్నేళ్లుగా రాజకీయ గ్రహణం పట్టుకుంది. 2014లో విశాఖ పశ్చిమలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దాడి కుమారుడు రత్నాకర్. తన బలం, స్థాన బలం లేనిచోట చేసిన ఆ ప్రయోగం విఫలమై.. సీనియర్ నేత బలహీనత బయటపడింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా పోటీచేసే అవకాశం లభించలేదు. ఇంతలో అనకాపల్లిలో ఈక్వేషన్లు మారిపోయాయి.

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రి. ఇక్కడ మంత్రికి.. మాజీ మంత్రికి రాజకీయ వైరం పెరిగిపోయింది. దీనికి తోడు పశ్చిమలో ఓటమి తర్వాత వైసీపీ అధినాయకత్వంతో విభేదించింది దాడి కుటుంబం. అందుకే 2019లో టికెట్‌ రాలేదని చెబుతారు. రాజకీయ కప్పదాటు వైఖరితో అనకాపల్లి సీటు వదులు కోవాల్సి వచ్చిందనే విమర్శలు దాడి కుటుంబం ఎదుర్కొంది. వైసీపీలో తిరిగి చేరినప్పుడే కుమారుడు రత్నాకర్‌కు రాజకీయ భవిష్యత్‌ కల్పించమని అధినాయకుడిని కోరారు దాడి. అందుకు సమ్మతించిన హైకమాండ్ పార్టీ బాధ్యతలు తండ్రికి, పొలిటికల్ కెరీర్ రత్నాకర్‌కు కల్పిస్తారనే ప్రచారం జరిగింది. ఈ తరుణంలో నామినేటెడ్ పోస్టులు ఆఫర్ చేసినా.. రాజకీయంగా తమస్థాయికి సరిపడవనే కారణాలతో వాటిని వదులుకుంది దాడి కుటుంబం. వీటిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ వంటివి ఉన్నాయి.

Read Also: Off The Record : టీడీపీలో ‘డోన్’ రగడ.. వర్గ పోరుతో సైకిల్ కు పంక్చర్

ఎమ్మెల్యే టికెట్‌ తప్ప మరే పదవులు తీసుకోరాదనే ఆలోచనలో ఉన్న వీరభద్రరావు మూడున్నరేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. అది మంత్రి అమర్నాథ్ వర్గానికి కలిసొచ్చింది. అనకాపల్లిలో తన వర్గాన్ని కాపాడుకోవడం, వ్యూహాత్మకంగా పాచికలు వెయ్యడం తప్ప మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చే ఛాన్స్ దాడికి లేకుండా పోయింది. సీఎం పర్యటనలకు వచ్చినప్పుడో.. కీలక సమావేశాల నిర్వహించే సందర్భంలో తప్ప వీరభద్రరావు కానీ ఆయన తనయుడు కానీ చురుకుగా వ్యవహరించడం లేదు. వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం లభిస్తుందా.. లేదా అనే మీమాంశ మరో కారణం. సిట్టింగ్ సీటును.. అందునా మంత్రిని నియోజకవర్గం ఖాళీ చేయించి తమకు ఇస్తారనే అంచనాలు ఏ కోశాన లేకపోవడమే దాడి ఫ్యామిలీ సైలెన్స్ వెనుక మరో కారణంగా భావిస్తున్నారు.

అమర్నాథ్‌ యలమంచిలికి షిఫ్ట్‌ అయితే… దాడికి అనకాపల్లి..!
మాస్టారు కెరీర్ ముగిసిందని ప్రత్యర్థులు అంచనా వేసుకుంటున్న సమయంలో.. మాజీ మంత్రికి మరోసారి కాలం కలిసి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నట్టు చర్చ మొదలైంది. దాడికి హైకమాండ్ దగ్గర ప్రాధాన్యం ఎంత ఉందనే దానికంటే సిట్టింగ్ సీటు దాదాపు ఖాళీ అవుతుందనే ఊహాగానాలే ఆ చర్చకు కారణం. అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ తిరిగి పోటీ చెయ్యబోరనే ప్రచారం కొన్ని నెలలుగా జరుగుతోంది. పొరుగునే ఉన్న యలమంచిలి వ్యవహారాల్లో అమర్నాథ్ పరోక్షంగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీనికితోడు అనకాపల్లిలో తిరిగి పట్టు సాధించాలంటే బలమైన గవర సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం.. కాపు ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నందున ఆ వర్గాన్ని దగ్గర చేసుకోవడం అనివార్యమనే వాదన వైసీపీలో ఉంది. టీడీపీ, జనసేన బలాలను, బలహీనతలను అంచనా వేశాక.. దాడి కుటుంబానికి ఛాన్స్‌ ఇస్తే సానుకూలంగా ఉండొచ్చనే వాదన ఉందట.

గతానుభవాలు మర్చిపోకపోతే మళ్లీ నిరాశ తప్పదా?
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దాడికి అవకాశం కల్పిస్తుందా.. లేక కొత్త ముఖాన్ని తెరపైకి తెస్తుందా అనేది ప్రస్తుతానికి ఒక చర్చ. మంత్రి అమర్నాథ్‌ సిట్టింగ్‌ సీటును కోరుకున్నా.. గతంలో మాజీ మంత్రి ప్రదర్శించిన దూకుడిని హైకమాండ్‌ మర్చిపోకపోయినా మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. అదే జరిగితే అనకాపల్లి రాజకీయాల్లో ఒక విధంగా ఉమ్మడి విశాఖ హిస్టరీలోనే మరుగునపడ్డ మరో కుటుంబం అవుతుందనే ఆందోళన దాడి సన్నిహితులు, వర్గీయుల్లో నెలకొందట. అలాగని తొందరపడి ఎటువంటి రిస్క్ తీసుకోలేని పరిస్థితి. మరి కాలపరీక్ష నుంచి మాజీ మంత్రి ఫ్యామిలీ ఏ విధంగా గట్టెక్కుతుందో చూడాలి.

Read Also: Off The Record: మంగళగిరిలో ఆర్కెకి అసమ్మతి రగడ

Exit mobile version