Off The Record about Mopidevi Venkata Ramana: మోపిదేవి వెంకటరమణ. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడు. 2019 ఎన్నికల్లో రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మోపిదేవిని సీఎం జగన్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. శాసనమండలిని రద్దు చేయాలనే జగన్ ఆలోచనలతో ఎమ్మెల్సీ, మంత్రి పదవి పోయాయి. అయినా రాజ్యసభకు ఎంపీగా పంపారు. వరుసగా దెబ్బతిన్నా ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ రేపల్లెలో వైసీపీ జెండా ఎగరేయాలనే పట్టుదలతో మోపిదేవి ఉన్నారు. దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో పావులు కూడా కదుపుతున్నారు. వైసీపీ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితంగా ఉండే మోపిదేవి జిల్లాలో పార్టీకి ఏ సమస్య వచ్చినా ట్రబుల్ షూటర్‌గా ఉంటారు. కానీ.. అలాంటి ట్రబుల్ షూటర్‌కు మళ్లీ అక్కడ ఎలా గెలవాలి అనే సమస్య మాత్రం వేధిస్తూనే ఉంది.
రేపల్లెలో కాపు సామాజికవర్గం ఎక్కువ. ఇప్పుడు టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మోపిదేవికి మళ్లీ గడ్డు పరిస్థితులు తప్పవనే ప్రచారం అక్కడ జరుగుతోంది. వైసీపీ ప్రభంజనంలోనూ అక్కడ గెలవలేకపోయింది. మరి తాజా పొత్తుల కాంబినేషన్‌తో మళ్లీ ఇబ్బంది తప్పదనే ఆందోళన ఆయనలో ఉందట. తన వారసుడిగా కొడుకు రాజీవ్‌ను రాజకీయాల్లోకి తేవాలని మోపిదేవి భావిస్తున్నారట. అంతవరకు బాగానే ఉన్నా ఫస్ట్ టైమ్‌లో 1989లో MLAగా తాను పోటీ చేయగానే ఓడిన విషయాన్ని సెంటిమెంట్‌గా భావిస్తున్నారట. అప్పటి ఆ సెంటిమెంట్.. ఇప్పటి.. పొలిటికల్ సిచ్యువేషన్ ఆయన్ను గందరగోళంలో పడేసిందట. ఈ టైమ్‌లో అక్కడ కొడుకుతో పోటీ చేయించడం ఎంత మాత్రం మంచిది కాదు అనేది మోపిదేవి అభిప్రాయంగా ఉందట. అయితే నియోజకవర్గంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, చోటో నాయకులే తప్ప మోపిదేవితో ఢీ అంటే ఢీ అని టికెట్ తెచ్చుకుని పోటీ చేసేంత కెపాటిసీ వారికి లేదు.
Read Also: Off The Record about Putta Sudhakar: టీడీపీ కేడర్‌కు అంతుచిక్కని పుట్టా తీరు.. పోటీ చేస్తారా..?
ప్రస్తుతానికి టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరూ లేరు. అడపా దడపా సినిమా యాక్టర్ల పేర్లు ఇక్కడ వినిపించినా మోపిదేవిని కాదని టికెట్ తెచ్చుకోవడం అంత సామాన్య విషయం కాదు. వేరే వాళ్లకు టికెట్ ఇవ్వడానికి మోపిదేవి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి. అలా సీటు వదిలేస్తే మళ్లీ దొరుకుతుందో లేదో తెలియదు. ఒకవేళ కొడుకుతో పోటీ చేయిస్తే.. తనకు జరిగినట్టు తొలిఎన్నికలో రాజీవ్‌ను కూడా ఓటమి పలకరిస్తే.. ఆ ప్రభావం కుమారుడిపైనా పడుతుందని భయపడుతున్నారట. అయితే అదే సెంటిమెంట్ రిపీటైతే.. మొదటిసారి ఓడినా.. తర్వాత రాజకీయాల్లో ఎదిగి మంత్రిగా.. ఎంపీగా పదవులు పొందుతారనే ప్రచారం కూడా ఉంది. మోపిదేవి మొదటిసారి ఓడింది రేపల్లెలో కాదని.. కూచినపూడిలో అని కొందరు గుర్తు చేస్తున్నారు. రేపల్లె మాజీ మంత్రి తనయుడికి స్వాగతం చెబుతుందని ఉత్సాహ పరుస్తున్నారట. అయినా, తన కొడుకు పోటీ విషయాన్ని మోపిదేవి బయట పెట్టడం లేదట. ఆయన మనసులో ఏం ఉందో ఎవరికీ తెలియడం లేదు. రాబోయే ఎన్నికల్లో రేపల్లెలో వైసీపీ నుంచి పోటీ చేసేది ఎవరు? అనేది ప్రశ్నగా ఉంది. మరి.. మాజీ మంత్రి మోపిదేవి.. తన కొడుకు విషయంలో ఏం చేస్తారో కాలమే చెప్పాలి.