1) తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఈనెల 17 నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 16న దీనిపై విద్యాశాఖ అధికారిక ప్రకటన చేయనుంది. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ఇప్పటికే విద్యాధికారుల ప్రభుత్వానికి మార్గదర్శకాలను అందించినట్లు తెలుస్తోంది.
2) టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది.
3) తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు జీవో 317ను రద్దు చేయాలని కోరుతూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా ప్రగతి భవన్‌ను ముట్టడికి టీచర్స్ యత్నించారు. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
4) కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు వాయిదాపడ్డాయి. రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’, రెబల్‌స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లాంటి పాన్‌ఇండియా సినిమాలు సైతం కరోనా దెబ్బకు యూటర్న్ తీసుకున్నాయి. తాజాగా చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ ఫిబ్రవరి 4న విడుదల కావడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది.
5) టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా నటించిన సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు మనీ లాండరింగ్ కేసులో సచిన్ జోషికి చెందిన మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ చర్యలు తీసుకుంది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ తెలిపింది.
6) ఎవరికీ పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చే అవసరం వైసీపీకి లేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి, జగన్ భేటీలపై స్పందించారు. జూన్‌లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి సీఎం జగన్ నిర్ణయం మేరకు పరిశీలిస్తామన్నారు.
7) వినుకొండ రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని జగన్ సర్కార్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించిందని నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలన్నారు.
8) యూపీ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలలో ర్యాలీలు, రోడ్ షోలపై ఎన్నికల కమిషన్ నిషేధం పొడిగించింది. గతంలో ఈనెల 15 వరకు నిషేధం విధించగా.. తాజాగా ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని ఈనెల 22 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం నాటి సమీక్ష అనంతరం వెల్లడించింది.
9) దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా విరాట్ కోహ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు. కేప్‌టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ నాటౌట్‌కు సంబంధించి డీఆర్ఎస్ విషయంలో విరాట్ కోహ్లీ స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి ప్రసార కర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ కోహ్లీపై విమర్శలు చేశాడు. కోహ్లీకి భారీ జరిమానా విధించాలని… అంతేకాకుండా కోహ్లీ నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు.
10) సీఎం జగన్‌ను చిరంజీవి కలిసింది కేవలం సినీ పరిశ్రమపై చర్చించటం కోసమేనని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని కూడా ఎందుకు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారో అర్థం అవ్వడం లేదన్నారు. అలా ఎందుకు చేస్తారో కూడా తెలియడం లేదని మంత్రి మండిపడ్డారు. కేవలం సినిమా వాళ్ల కోసమే చిరంజీవి వస్తే ఏదో ఒక రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. సీఎం జగన్ అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు.