Mylavaram: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం యూట్యూబ్ లో చూసి పథకం ప్రకారం తండ్రిని హత్య చేశాడు ఓ కొడుకు. ఈ నెల ఎనిమిదో తేదీన మైలవరం మండలం ములకలపెంట గ్రామంలో మొక్కజొన్న తోటలో కడియం శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందాడు. అతడిని తన కొడుకు పుల్లారావు(32) హత్య చేశాడని మీడియా సమావేశంలో మైలవరం ఏసీపీ ప్రసాద్ రావు వెల్లడించారు. అయితే, యుట్యూబ్ లో చూసి తండ్రి హత్యకు ప్లాన్ రచించాడని పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు.
Read Also: Off The Record: తీవ్ర గందరగోళంలో ముమ్మిడివరం ఫ్యాన్ పార్టీ
ఇక, ఆస్తి విషయంలో తండ్రి శ్రీనివాసరావుతో గొడవ పెట్టుకున్న కొడుకు పుల్లారావు కొట్టి చంపాడని పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడని ఏసీపీ ప్రసాద్ రావు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుని పుల్లారావు అప్పులపాలైయ్యాడని, ఆ అప్పులు తీర్చడానికి తండ్రి అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఈ కేసును తప్పు దోవ పట్టించేందుకు పుల్లారావు పక్క పొలం చల్లా సుబ్బారావుతో గతంలో ఉన్న సరిహద్దు వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి తప్పించుకొనేందుకు ప్రయత్నించాడని ఏసీపీ పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని..ఈ కేసును ఛేదించడంలో మైలవరం సీఐ దాడి చంద్రశేఖర్, మైలవరం ఎస్ఐ కే.సుధాకర్, జీ కొండూరు కే.సతీష్ కుమార్, గంపలగూడెం ఎస్ఐ శ్రీనివాస్ లతో పాటు సిబ్బందిని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అభినందించారని ఏసీపీ ప్రసాదరావు చెప్పారు.