NTV Telugu Site icon

Tirumala: శ్రీవారికి కాసులే కాసులు.. వరుసగా 9వ నెల కూడా రికార్డు..!!

Tirumala Temple

Tirumala Temple

Tirumala: రుమలలో సరికొత్త రికార్డుల దిశగా శ్రీవారి హుండీ ఆదాయం సాగుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేయగా.. కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది. 8 నెలలుగా ప్రతి నెలా తిరుమల వెంకటేశుడి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటుతోంది. తాజాగా వరుసగా 9వ నెల కూడా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం.

Read Also: Akhanda: బాలయ్య మ్యాజిక్ ని రిపీట్ చేయడం కష్టమే

నవంబరు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.127.3 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ వార్షిక సంవత్సరంలో హుండీ ఆదాయం రూ.1600 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత 9 నెలల కాలంలో అత్యధికంగా జూలై నెలలో రూ.139.35 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. భక్తుల సంఖ్య ప్రతి రోజూ 70 వేలకు పైగా ఉండటం, నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం ప్రతి రోజూ లభిస్తుండటంతో ఈ స్థాయిలో హుండీ ఆదాయం సాధ్యమవుతోంది. ఇప్పటి వరకు 2019-20 వార్షిక సంవత్సరంలో లభించిన రూ.1,313 కోట్లే అత్యధిక హుండీ ఆదాయంగా ఉంది. ఇదే ఏడాది జూలై 4న శ్రీవారికి ఒక్కరోజులో అత్యధికంగా 6.14 కోట్ల హుండీ ఆదాయాన్ని భక్తులు సమర్పించారు.

కరోనా తర్వాత భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మొక్కులను ఒకేసారి తీర్చుకుంటున్నారు. అందుకే ఆదాయం నెలకు వంద కోట్లకు పైగానే వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అటు భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో వసతులు, అన్నదానం వంటి సౌకర్యాలను కూడా పెంచారు. వచ్చే నెలలో వైకుంఠ ఏకాదశి వస్తుండటంతో హుండీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.