తెలుగు రాష్ట్రాలను భారీవర్షాలు వణికిస్తూనే వున్నాయి. విశాఖలోని వాతావరణ కేంద్రం వాతావరణ హెచ్చరికలు జారీచేసింది. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయింది తీవ్ర అల్పపీడనం.దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్ర తీరాలను అనుకుని బలపడుతుంది ఈ తీవ్ర అల్పపీడనం. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకా
శం వుందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు చురుగ్గా రుతుపవనాలు కదులుతున్నాయి. ఉత్తరాంధ్ర,యానాంలో ఎల్లో బులెటిన్ వార్నింగ్ జారీచేసింది. అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా మారింది. నాలుగు రోజులు వేట నిషేధం విధించింది. ఏపీ,తెలంగాణ, ఒడిషా, చత్తీస్ ఘడ్ లకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారిణి నాగరత్న తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆమె వివరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆగస్టు 7న, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్‌లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం రాత్రి నుంచి హైదరాబాద్ లో వర్షం పడుతూనే వుంది. సోమవారం ఉదయం కూడా అది కంటిన్యూ అయింది. దీంతో ఉద్యోగాలకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు.