పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..విశాఖ ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఓ వైపు అధికారులు దాడులతో వేల కిలోల స్వాధీనం చేసుకుంటున్నారు. మరో వైపు స్మగ్లర్లు గంజాయి చేరవేతకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు కరివేపాకు పొడి, హెర్బల్ పౌడర్ల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో విశాఖ కేంద్రంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు.
మనమంతా అమెజాన్, ప్లిప్ కార్ట్, ఏజీయో, మింత్రా వంటి ఈ మార్కెట్ వెబ్ సైట్స్ కోసం వినే వుంటాం. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతీ ఒక్కరికి ఇప్పుడు ఆన్ లైన్ లో షాపింగ్ చేయాలంటే ఇటువంటే యాప్స్ ఏ దిక్కు. నచ్చిన వస్తువును క్షణాల్లో బుక్ చేసి రోజుల వ్యవధిలోనే పొందే సదుపాయం కల్పించాయి ఈ మార్కెట్ వెబ్… కానీ తాజాగా చోటుచేసుకున్న ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయ్. ఆన్ లైన్ లో షాపింగ్ కి ఉపయోగించే వీటిని కూడా గంజాయి స్మగ్లర్లు విడిచిపెట్టలేదు. అమెజాన్ వేదికగా గుట్టుచప్పుడు కాకుండా విశాఖ నుండి గంజాయిని తరలిస్తున్నారు.
ఏ మాత్రం అనుమానం రాకుండా కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయిని అక్రమంగా సరఫరా చేసి క్యాష్ చేసుకుంటున్నారు… గంజాయి సప్లయ్ చేసే ముఠాలు ఎప్పటికప్పుడు రూట్లు మారుస్తున్నారు. ఎందుకంటే పోలీసుల నిఘా ఉండటంతో కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో గంజాయి సరఫరా పై భారీగా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని విపక్షాలు పదే పదే విమర్శిస్తున్నారు. ఇక గంజాయి సరఫరా ఏ రాష్ట్రంలో బయట పడ్డా..ఆ లింకులు ఆంధ్రప్రదేశ్ తో ఉంటున్నాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ నుంచి భారీగా అక్రమంగా గంజాయి రవాణా అవుతోందని తేలుతుంది. ఇప్పటికే విశాఖకు ఇదో మాయని మచ్చలా తయారైంది.. దీంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సరఫరాను నియంత్రించేందుకు ఫోకస్ చేసింది. విశాఖ వచ్చిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి గంజాయి సాగు ధ్వంసం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.