NTV Telugu Site icon

AP Excise Policy: ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు..

Babu

Babu

AP Excise Policy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలసీ రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం నాలుగు టీంలను ఏర్పాటు చేస్తున్నాట్లు ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో టీంలో ముగ్గురు చొప్పన అధికారులను ఎంపిక చేసింది. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లనున్నాయి.

Read Also: Viraaji Movie Review: వరుణ్ సందేశ్ ‘విరాజి’ రివ్యూ

ఇక, ఆ రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీ, షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ నాలుగు టీమ్స్ అధ్యయనం చేయనున్నాయి. ట్రాక్ అండ్ ట్రేస్, డీ- ఎడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాల పైనా ఈ బృందాలు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న బృందాలు.. ఈ నెల 12వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని నాలుగు అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి కొత్త ఎక్సైజ్ విధానాన్ని సిద్దం చేసేలా ఏపీ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది. అక్టోబర్ నెల నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానుంది.