Site icon NTV Telugu

Navy Day: విశాఖ సాగర తీరంలో నేవీ డే వేడుకలు.. నౌకాదళ విన్యాసాలు

Vizag Rk Beach Navy Day

Vizag Rk Beach Navy Day

Navy Day Celebrations At Vizag RK Beach: 1971లో పాకిస్తాన్‌‌తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయ ఘట్టాన్ని పురస్కరించుకొని.. ప్రతీ ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీ డే పేరిట నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదిలో కూడా డిసెంబర్ 4న విశాఖ ఆర్కే బీచ్ వద్ద నేవీ విన్యాసాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేసి.. లాంఛనంగా నేవీ డే విన్యాసాలను ప్రారంభించారు. భారత నేవీ ప్రచురించిన ప్రత్యేక బ్రోచర్‌ను కూడా ఆమె ఆవిష్కరించారు.

తొలుత ఈ కార్యక్రమంలో భాగంగా నౌకాదళ సిబ్బంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సింధువీర్ సబ్‌మెరైన్ ద్వారా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి నేవీ డే విన్యాసాల్ని ప్రారంభించగా.. నేవీ సిబ్బంది అబ్బురపరిచే రీతిలో విన్యాసాల్ని చేపట్టారు. చేతక్ హెలికాప్టర్లతో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ.. గగనవిహారం చేశారు. హెలికాప్టర్ నుంచి నేవీ మెరైన్ కమాండోలు జెమిని బోట్లలోకి దిగగా.. ఆ బోట్లు వేగంగా తీరానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా.. తీరంలో యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలను ఈ ఆపరేషన్‌లో ప్రదర్శించారు. అంతేకాదు.. ఓ యుద్ధ నౌకలో కూడా మెరైన్ కమాండోలు విన్యాసాలు చేశారు.

నేవీకి చెందిన మిగ్-29 యుద్ధవిమానాలు గగనతలంలోకి దూసుకెళ్లడం, యుద్ధ విమానం నుంచి వెలువడిన కాంతిపుంజాలతో ఆకాశం వెలిగిపోవడం, యుద్ధ నౌకలతో పాటు సబ్‌మెరైన్‌ల నుంచి రాకెట్ ఫైరింగ్ చేపట్టడం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి. ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, అత్యాధునిక యూహెచ్‌బీ హెలికాప్టర్ల ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కలిగివున్న అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా విన్యాసాల్లో ప్రదర్శించారు. బోయింగ్ రేంజ్ పీఎస్ఐ విమానాల విన్యాసాలైతే.. ఈ ఈవెంట్‌లోనే ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఈ విన్యాసాలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి విడదల రజని, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు హాజరయ్యారు.

ఇదిలావుండగా.. 1971లో పాకిస్తాన్‌, భారత్ మధ్య జరిగిన యుద్ధంలో విశాఖ నేవీ స్థావరం కూడా కీలక పాత్ర పోషించింది. తూర్పు తీరంలో ఉన్న భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నాశనం చేసేందుకు.. ఘాజీ అనే సబ్‌మెరైన్‌ని పాకిస్తాన్ పంపింది. అయితే.. అది లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే, విశాఖకు సమీపంలో ఘాజి సముద్ర జనాల్లో సమాధి అయ్యింది. ఆ విజయ ఘట్టాన్ని పురస్కరించుకొనే, ఈ నౌకాదళ విన్యాసాల్ని నిర్వహించడం జరుగుతోంది.

Exit mobile version