NTV Telugu Site icon

Nara Lokesh: దేశంలోనే అత్యధికంగా ఏపీలో ‘వ్యాట్’ బాదుడే బాదుడు

Nara Lokesh

Nara Lokesh

పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే వ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు లోకేష్ ఆరోపించారు. ఇకనైనా వ్యాట్ తగ్గించి బాదుడే బాదుడిని ఆపాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇత‌ర రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై భారాలు త‌గ్గిస్తుంటే ఏపీలో ఒక్కసారి కూడా త‌గ్గించ‌కుండా మ‌రింతగా పన్నులు పెంచడం సమంజసం కాదన్నారు.

Pawan Kalyan: జగన్ సర్కార్ కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం రెండు విడ‌త‌ల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప‌న్నులు త‌గ్గించి వాటి ధ‌ర‌లు త‌గ్గేలా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని లోకేష్ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో పాటు 23 రాష్ట్రాలు కూడా తాము విధించిన పన్నుల‌ను తగ్గించుకున్నట్లు గుర్తుచేశారు. ప్రజ‌ల‌పై ధరల భారాన్ని తగ్గించి ఊరట కలిగిస్తున్నాయని తెలిపారు. టీడీపీ హయాంలో ప్రజలపై పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్‌ను రూ.2కి తగ్గించామన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ‌గా పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్ విధిస్తున్నారన్నారు. వ్యాట్‌కు తోడు రోడ్డు సెస్ అంటూ రూపాయి వసూలు చేసి దేశంలోనే ఎక్కువ‌గా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధ‌రల పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారని లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీ వ‌ల్ల ర‌వాణా రంగంపై ఆధార‌ప‌డిన అన్ని రంగాలూ తీవ్ర న‌ష్టాల్లోకి వెళ్లాయన్నారు. ప‌న్నుల రూపంలో పెట్రోల్, డీజిల్‌పై ప్రజలను దోచుకోవాలన్న జగన్ ప్రభుత్వం దురాశ‌ కారణంగా నిత్యావ‌స‌రాలు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మాన‌వ‌తా ధృక్పథంతో ఆలోచించి బాదుడే బాదుడుకి స్వస్తి చెప్పాల‌ని లోకేష్ హితవు పలికారు.