గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌తో పాటు ప్రశ్నాపత్రలు లీక్ అయ్యాయి. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి, ఏదో ఒక చోట క్వశ్చన్ పేపర్స్ లీకమవుతూ వస్తున్నాయి. దీంతో, ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై సీఎం జగన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పదో తరగతి పరీక్షల్లో లీక్, మాస్ కాపీయింగ్‌తో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, వైసీపీ మీద తారాస్థాయి విమర్శలూ చేశారు.
Read Also: Breaking: రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు హైకోర్టు అనుమతి
వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లోనే ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షమవుతున్నాయని ఆరోపించిన లోకేష్.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మేథ్స్ క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్ సెంటర్‌కి చేరకముందే వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో లీకమవుతున్నాయన్నారు. వైసీపీ నాయకుల పిల్లలకు మెరుగైన మార్కులు తెప్పించుకోవడం కోసమే ఈ లీకులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘‘పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం మీ ప్రభుత్వంపై నిరసన తెలిపిన టీచర్లను వేధించేందుకు టెన్త్ పరీక్షల్ని వాడుకుంటున్నారనే అనుమానాలున్నా’’యని లోకేష్ ఆ లేఖలో బాంబ్ పేల్చారు. జగన్ పాలనలో విద్యాశాఖ భ్రష్టుపట్టిందని మండిపడ్డ ఆయన.. మంత్రుల వల్ల అది ఇంకా పతనావస్థకి చేరిందన్నారు.
పేపర్ల లీక్, మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌పై మంత్రి బొత్స పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని ఇచ్చిన సమాధానం బాధ్యతారాహిత్యంగా ఉందని.. ఆయన్ను విద్యాశాఖ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇంకా మిగిలిన రెండు పరీక్షల్ని అయినా పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తోన్న పదోతరగతి పరీక్షల నిర్వహణలో జగన్ ప్రభుత్వం విఫలమైందని, ఈ ఘోర వైఫల్యంతోనైనా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జగన్ పాలనా యంత్రాంగం నిర్వహించిన ఈ పరీక్షలు చరిత్రలోనే చీకటి అధ్యాయంగా నిలిచాయన్నారు.
ప్రతిభకి కొలమానంగా నిలవాల్సిన పరీక్షలు అక్రమాల విక్రమార్కులకి వరంగా మారాయని ఆయన చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో పేపర్ లీకైన ఘటనలో, అప్పటి మంత్రి జీఎంసీ బాలయోగి తన పదవికి రాజీనామా చేసిన చరిత్ర ఉందని లోకేష్ గుర్తు చేసుకున్నారు. సీఎంగా వైఫల్యం, అధికారుల చేతగానితనం, వైసీపీ నేతల స్వార్థంతో టెన్త్ పరీక్షల నిర్వహణ అభాసుపాలై, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా మారిందంటూ ఆ లేఖలో లోకేష్ ఫైరయ్యారు. మరి, ఇందుకు బదులుగా అధికార పార్టీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.